Mon Dec 23 2024 09:30:30 GMT+0000 (Coordinated Universal Time)
Sunitha : గెలిచినా ఓడినట్లేనా... ఎందుకిలా.. జరుగుతోంది?
తెలంగాణలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా ఆమెకు అధికారం మాత్రం లేదట
కాంగ్రెస్ లో ఉండగా గెలిచి మంత్రి అయ్యారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఆమెకు కాలం కలసి రావడం లేదు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అధికారాలు లేకుండా పోయింది. ఆమె నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. సునీతా లక్ష్మారెడ్డి సీనియర్ నేత. తెలంగాణ రాజకీయాల్లో ఆమె మృదుస్వభావిగా పేరు పొందారు. పొలిటికల్ బ్రాండ్ అధికంగా ఉన్న సునీత ఆమె భర్త మరణంతో తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కాంగ్రెస్ హయాంలో అందులోనూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉనన సమయంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన వరకూ ఆమె మంత్రి పదవిలోనే కొనసాగారు.
వరస గెలుపులతో...
సునీతా లక్ష్మారెడ్డి వరసగా నర్సాపూర్ నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1999లో గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో రాకపోవడంతో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఇక 2004, 2009 ఎన్నికల్లోనూ ఆమె నరసాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో వైఎస్ మంత్రివరగ్ంలో చిన్న నీటివనరుల మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య మంత్రివర్గంలోనూ ఆమె కొనసాగారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినా ఆమెకు మహిళ శిశు సంక్షేమ శాఖలను అప్పగించారు. అందరితో కలవిడిగా, కలుపుకుని వెళ్లే నేతగా కాంగ్రెస్ లో సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేకత సంపాదించుకున్నారు.
నాలుగోసారి గెలిచినా...
అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలు అంటే 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె గెలవలేదు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయంది. దీంతో 2019లో ఆమె బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆమె పార్టీలో చేరిన తర్వాత మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారు కేసీఆర్. మొన్న జరిగిన ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని సునీతకు కేసీఆర్ టిక్కెట్ కేటాయించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అయితే బ్యాడ్ లక్. ఈసారి ఆమె గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు.
పెత్తనం మాత్రం...
కానీ అక్కడ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన ఆవుల రాజారెడ్డి నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారట. తాను ఎమ్మెల్యే అయినా ఆయన అధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రొటోకాల్ ను అధికారులు పాటించడం లేదంటున్నారు. ఇలాగయితే ఎలా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు అధికారులు సహకరించకుంటే ఎవరు సహకరిస్తారని ఆమె నిలదీస్తున్నారు. తాను కాంగ్రెస్ లో ఉండగా ఉన్న వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వారితో ఉన్న పరిచయాలతో ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు. అయితే అక్కడ ఓడిపోయిన రాజారెడ్డి మాత్రం నియోజకవర్గం నాదే అంటున్నారట. ఆమె ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ నేతల చెవులకెక్కుతాయా?
Next Story