Mon Nov 25 2024 02:23:41 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీలే విలన్లు.. వారే వీళ్లకు అడ్డంకి
శాసనసభ వేరు.. శాసనమండలి ప్రత్యేకం. రెండూ చట్ట సభలే. కానీ ఒకటి ప్రజల నేరుగా ఎన్నుకునే సభ మరొకటిది పరోక్షంగా ఎంపిక చేసే సభ
శాసనసభ వేరు.. శాసనమండలి ప్రత్యేకం. రెండూ చట్ట సభలే. కానీ ఒకటి ప్రజల నేరుగా ఎన్నుకునే సభ కాగా, మరొకటిది పరోక్షంగా ఎంపిక చేసే సభ. అందుకే ఎక్కువ మంది రాజకీయ నేతలు పెద్దల సభ కన్నా శాసనసభకే ప్రయారిటీ ఇస్తారు. తాము ప్రజల మద్దతు గెలిచి మరీ నియోజకవర్గానికి కింగ్ కావాలని కోరుకుంటారు. అదే నియోజకవర్గానికి చెందిన నేత ఎమ్మెల్సీగా ఎంపికయినా ఆరోవేలు కింద లెక్కే. ఎమ్మెల్యేకున్న అధికారాలన్ని చట్టపరంగా అన్నీ ఉన్నా పెత్తనం మాత్రం ఎమ్మెల్యేలదే. ఎమ్మెల్యేలకున్న ప్రాధాన్యత ఎమ్మెల్సీలకు ఉండదు. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీలే అధికార పార్టీకి అడ్డంకిగా మారారు.
ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా...
కోట్ల రూపాయలు వెచ్చించి శాసనసభకు ఎన్నికవ్వాలని కోరుకుంటారు తప్పించి పార్టీ అధినేత ఇచ్చే ఎమ్మెల్సీ పదవి కోసం పెద్దగా వెంపర్లాడరు. నియోజకవర్గంలో తమ పట్టు సడలిపోకూడదన్నదే నేతల తాపత్రయం. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీలే విలన్లుగా మారారు. ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా తయారయ్యారు. వారికి దక్కాల్సిన సీటును కొందరు తన్నుకు వెళుతుంటే.. మరికొందరు తమకు శాసనసభ ఎన్నికల్లో సీటు దక్కలేదని చివరకు ఎమ్మెల్సీ పదవిని వదిలి పెట్టి పార్టీ మారిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అదే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు తేడా. ఇద్దరికీ ప్రభుత్వ పరంగా అందే ప్రొటోకాల్ ఒకటే అయినా నియోజకవర్గంలో మాత్రం ఇద్దరి మధ్య పోటా పోటీ నెలకొంది.
ఎమ్మెల్యేను కాదని...
బీఆర్ఎస్లో స్టేషన్ఘనపూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య గెలుస్తూ వస్తున్నా ఆయనకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శత్రువుగా తయారయ్యారు. గత కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య పొసగడం లేదు. ఎవరి వర్గాలు వారివే. ఎవరి ఓటు బ్యాంకు వారిదే. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కడియం శ్రీహరి నాలుగేళ్ల ముందు నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రాజయ్యపై ఆరోపణలు రావడం ఆయనకు ప్లస్ గా మారింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ టిక్కెట్ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి దక్కింది. ఇప్పుడు రాజయ్య శ్రీహరి గెలుపు కోసం ఏ మేరకు కృషి చేస్తాడన్నది చూడాల్సి ఉంది. కానీ ఒకసారి శ్రీహరి గెలిస్తే తనకున్న గ్రిప్ పోతుందని భావించే రాజయ్య ఆయన గెలుపుకోేసం కృషి చేయడానికి పెద్దగా అవకాశాలు లేవు.
ఇక్కడ కూడా....
ఇక కల్వకుర్తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు కేసీఆర్ తిరిగి టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. తనకు టిక్కెట్ దక్కలేదని భావించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చివరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే.. ఎమ్మెల్యే అభ్యర్థికి శత్రువుగా మారాడు. ఇక జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు టిక్కెట్ ఇంతవరకూ గులాబీ బాస్ ఖరారు చేయలేదు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే ఎమ్మెల్సీలే ఎమ్మెల్యేల పాలిట విలన్లుగా మారారు. జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తే ముత్తిరెడ్డి ఏ మేరకు సహకారం అందిస్తారన్నది చూడాలి.
Next Story