Sun Dec 22 2024 02:06:59 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : లక్కు అంటే వీరిదే.. కదా.. అడక్కుండానే టిక్కెట్లు... ఒకటి కాదు ఫ్యామిలీ ప్యాక్
వైసీపీలో కొన్ని కుటుంబాలకు రెండు, మూడు అసెంబ్లీ టిక్కెట్లు దక్కుతున్నాయి. ఫ్యామిలీకి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు
వైసీపీలో సీనియర్లను కూడా పక్కన పెడుతున్నారు. వరసగా విడుదలవుతున్న జాబితాలు అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికి 59 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేపట్టారు. దాదాపు ఇరవై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు రావని తేలిపోయింది. సీట్లు రావని తెలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు పార్టీకి రాజీనామాలు చేశారు. పార్ధసారధి కూడా అదే బాటలో ఉన్నారు. సీట్లు రాని వాళ్లు ఉంటారా? లేదా? అన్నది పక్కన పెడితే అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాతనే సీటును కన్ఫర్మ్ చేస్తున్నారని, నాలుగో జాబితాలోనూ ఎక్కువ మంది ఉండే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
రెండు నుంచి మూడు సీట్లు...
ఈ నేపథ్యంలో కొన్ని కుటుంబాలకు మాత్రం బంపర్ ఆఫర్ తగిలినట్లయింది. ఒక్క ఫ్యామిలీలో రెండు, మూడు సీట్లు రావడం ఇప్పుడు పార్టీలో చర్చీనీయాంశంగా మారింది. వేర్వేరు నియోజకవర్గాలలో ఒకే కుటుంబంలో ఉన్న వారికే వైసీపీ సీట్లు కేటాయిస్తుండటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఫ్యామిలీ ప్యాక్ బాగానే పనిచేస్తుంది. ఉత్తరాంధ్రలోనే కాదు రాయలసీమ, ఇటు కోస్తాంధ్రలోనూ ఒకే కుటుంబంలో రెండు, మూడేేసి సీట్లు దక్కుతుండం కూడా ఆశ్చర్యకరమే. అయితే సామాజికవర్గం పరంగా, ఆర్థికంగా, ఆ నియోజకవర్గంలో బలమైన నేతలు కావడంతో వైసీపీ అధినేత జగన్ కూడా కాదనలేకపోతున్నారు.
కుటుంబంలో వారికే...
ఉత్తరాంధ్రలో మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు మరోసారి టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఆయన సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖపార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి పదవిని ఇచ్చారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి బొత్స మేనల్లుడు చిన్న శ్రీనును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అలాగే ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు బెర్త్ ఖరారయింది. ఆయన తండ్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఒకే ఫ్యామిలీలో...
ఇక మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబంలో మూడు టిక్కెట్లు ఖరారయ్యాయి. ఆదిమూలపు సురేష్ ను కొండపి ఇన్ఛార్జిగా నియమించారు. అదే సమయంలో కోడుమూరు ఇన్ఛార్జిగా సురేష్ సోదరుడు సతీష్ ను నియమించారు. ఇక మడకశిరకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిప్పేస్వామి మంత్రి సురేష్ బావ కావడం విశేషం. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ఆయన సోదరుడు వై వెంకట్రామిరెడ్డి గుంతకల్లు నియోజకవర్గానికి టిక్కెట్లు దక్కే అవకాశముంది. వారి మరో సోదరుడు వై శివరామిరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా ఆయన కుమారుడిని రామచంద్రాపురం ఇన్ఛార్జిగా నియమించారు. ఇలా కొందరికి టిక్కెట్లు దక్కకపోవడం, మరికొందరికి మాత్రం రెండుకు మించి సీట్లు దక్కడంతో భారీ ఆఫర్ లభించినట్లయింది.
Next Story