Fri Nov 22 2024 10:03:14 GMT+0000 (Coordinated Universal Time)
Devineni Uma : దేవినేని ఉమపై ఎందుకంత వ్యతిరేకత..? ప్రజల్లోనా? పార్టీలోనా?
టీడీపీలో సీనియర్ నేత దేవినేని ఉమకు ఇప్పటి వరకూ టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోవడం చర్చనీయాంశమే
దేవినేని ఉమామహేశ్వరరావు.. టీడీపీలో సీనియర్ నేత. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ హఠాన్మరణంతో దేవినేని ఉమ హటాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా పార్టీలో ముద్రపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమ మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం తొలిసారి ఓటమి పాలయ్యారు.
అధికారంలో ఉన్న సమయంలో...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచారు. అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ముందుండే వారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన మైలవరం నుంచి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును పరగులు పెట్టించేందుకు ఆయన తరచూ అక్కడకు వెళ్లి సమీక్షలు నిర్వహించేవారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలో పార్టీ నేతలకు ఉమ కంటగింపుగా తయారయ్యారు. అధినాయకత్వం వద్ద తనకు తిరుగులేదని భావించిన దేవినేని ఉమ కిందిస్థాయి క్యాడర్ తో పాటు సహచర నేతలను కూడా లెక్కచేయలేదు.
తన మాటే నెగ్గాలని...
కృష్ణా జిల్లాలో తన మాటే నెగ్గాలని పట్టుబట్టే వారు. ఎంపీ, ఎమ్మెల్యేలను పట్టించుకునే వారు కారన్న ఆరోపణలు ఆయనపై బలంగానే వినిపించాయి. ఎంపీ కేశినేని నానితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు దేవినేని ఉమ తీరును వ్యతిరేకించినా, అధినాయకత్వం ఉమకు ఇస్తున్న ప్రయారిటీ చూసి పెదవి విప్పలేకపోయేవారు. జిల్లాలో ఏ నియామకం జరిగినా తనకు తెలియకుండా జరగడానికి లేదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. అయినా ఆయన ఎవరినీ లెక్క చేయలేదు. చంద్రబాబు, లోకేష్ లు తన జేబులో ఉన్నారని దేవినేని ఉమ భ్రమించేవారు. అందుకే రెచ్చిపోయి మరీ ఆ ఐదేళ్లు చెలరేగిపోయారంటారు ఆయన ప్రత్యర్థులు.
చివరకు టిక్కెట్ విషయంలోనూ...
కట్ చేస్తే.. అధినాయకత్వానికి అంత దగ్గరని చెప్పుకుని తిరిగి.. తనకు తిరుగులేదని భావించిన దేవినేని ఉమ అదంతా భ్రమ అని తేలింది. 2024 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం కూడా కష్టంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు తయ్యారయ్యాయి. అక్కడకు వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలో చేరుతుండటంతో దేవినేని ఉమకు మైండ్ బ్లాంక్ అయింది. తాను వ్యతిరేకించిన వారినే అధినాయకత్వం దగ్గరకు తీస్తుందని ఆయన సైలెంట్ అయిపోయారు. దేవినేని ఉమకు పెనమలూరు ఇవ్వాలని భావించిన అక్కడ ఇన్ఛార్జి బోడే ప్రసాద్ ససేమిరా అంటున్నారు. వేరెవరికి టిక్కెట్ ఇచ్చినా తాను స్వతంత్రంగా బరిలోకి దిగి చంద్రబాబు ఫొటో పెట్టుకుని గెలుస్తానని చెబుతున్నారు. దీంతో దేవినేని ఉమకు ఈసారి టిక్కెట్ వస్తుందా? లేదా?అన్నది మాత్రం ఇంకా తేలలేదు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదనడానికి దేవినేనిని నిదర్శనంగా చూపించవచ్చు.
Next Story