Sun Dec 22 2024 02:13:07 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రాజకీయాల్లో అంకెలు ఎంత ముఖ్యమో... లెక్కలు కూడా అంతే అవసరమే
జగన్ తన పాలనకు తిరుగులేదని నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగానే విశ్వసిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతు చిక్కని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న జగన్ తన పాలనకు తిరుగులేదని నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగానే విశ్వసిస్తున్నారు. ఇంతగా పేదలను ఆదుకున్న ప్రభుత్వం మరేదీ లేదని, అందుకే తాను ఎవరిని ఎన్నికల్లో బరిలోకి దింపినా తనను చూసి ఓటేస్తారని ఆయన భావిస్తున్నారు. 2019 ఎన్నికల తరహాలోనే తన బొమ్మతోనే అభ్యర్థులు గెలవాలని జగన్ ఆశిస్తున్నారు. అప్పుడే తన క్రేజ్ మరింత పెరుగుతుందని, అలాగే పాలిటిక్స్ లో తన ఇమేజ్ కూడా ఆకాశం వైపు చూస్తుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎడా పెడా అభ్యర్థులను మార్చేశారు. ఇంకా మార్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆయన నియోజకవర్గాలకు ఇన్ఛార్జులనే నియమించారు.
స్వయంకృతమే...
అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఎన్నికల సమయానికి అభ్యర్థులను మార్చేందుకు అవకాశాలు చాలాగానే ఉన్నాయి. మరికొన్ని సార్లు సర్వేలు చేయించిన తర్వాత అభ్యర్థులను మార్చే ఛాన్స్ కూడా ఉందని తాడేపల్లి నుంచి వినిపిస్తున్న మాటలను బట్టి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే రెండు బలమైన జిల్లాల్లో జగన్ తొందరపాటు పడ్డారా? లేక అతి విశ్వాసానికి వెళ్లారా? అన్నది ఇప్పుడే తేలదు. ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనుంది. ఎందుకంటే బలమైన ఇద్దరు నేతలను ఆయన కావాలనే కాలదన్నుకున్నారు. వారు ఎందుకు ఊరుకుంటారు? తమను కాదంటే... ఆహ్వానించడానికి టీడీపీ రెడీగా ఉందని చెప్పి సైకలెక్కేయడానికి సిద్ధపడ్డారు. ఆర్థికంగా, సామాజకంగా బలమైన నేతలను వదులుకోవడం నిజంగా జగన్ స్వయంకృతమేనని చెప్పక తప్పదు.
బలమైన నేత లేని చోట...
నెల్లూరు జిల్లాలో బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ దూరం పెట్టారు. ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి ఆర్థికంగా బలమైన నేత లేని జిల్లాలో జగన్ ఏరికోరి ఆ పార్టీకి అందించినట్లయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. సామాజికపరంగానే కాకుండా సేవా కార్యక్రమాలను చేస్తూ వేమిరెడ్డి కుటుంబం ప్రజలకు చేరువయింది. ఆయన గెలవడంతో పాటు ఆయన పోటీ చేసిన పార్లమెంటు నియోజకవర్గంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయనను గెలిపించుకునే వీలుందన్న విషయాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఎన్నికల వ్యయంతో పాటు ప్రజలను ఆకట్టుకునే శక్తి వేమిరెడ్డికి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి వేమిరెడ్డి ఎగ్జిట్తో పదిలో కొన్ని చేతులారా చేజార్చుకోవడం తప్పేట్లులేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
కాదనుకున్న వారే....
ప్రకాశం జిల్లాలో మరో బలమైన కుటుంబం మాగుంటది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు దశాబ్దాల నుంచి ఆ కుటుంబం రాజకీయం చేస్తుంది. పార్టీ పరంగా మాత్రమే కాకుండా మాగుంటకు వ్యక్తిగతంగా ప్రతి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. కార్యకర్తలున్నారు. అటువంటి మాగుంటను కూడా వైసీపీ వదులుకుంది. ఒంగోలు పార్లమెంటులో టీడీపీ గెలిచి మూడున్నర దశాబ్దాలయింది. అయితే ఈసారి జగన్ తీసుకున్న నిర్ణయంతో సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ జెండా పార్లమెంటు నియోజకవర్గంలో ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా పక్కపక్కనే ఉన్న రెండు జిల్లాల్లో జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీకి నష్టం కలగగా, అభ్యర్థులే లేని, బలమైన నేతలు కరువైన జిల్లాల్లో జగన్ టీడీపీకి లీడర్లను ఇచ్చినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా.. వెంటిలేటర్ మీద ఆ జిల్లాల్లో ఉన్న టీడీపీకి జగన్ ఊపిరి పోశాడన్నది వాస్తవం.
Next Story