కేసీయార్ బాటలో జగన్..?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా పది నెలల సమయం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా పది నెలల సమయం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఖరి చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఎన్నికల సమయానిక్ి జగన్ వ్యూహాల గురించే ప్రతిపక్షాలు టెన్షన్ పడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. అన్ని వర్గాలనూ సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఈ విషయం అర్థమైన కేసీయార్ ఎన్నికలకు ముందు వరాలు ప్రకటించడం ప్రారంభించారు. అధికారంలో ఉండటం అనే అడ్వాంటేజీని కేసీయార్ తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వీఆర్వోలను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం, మైనారిటీ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం లాంటి అస్త్రాలతో తనకు దూరమవుతున్న వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలను ఆయన మొదలు పెట్టారు.
ఆర్టీసీ ఉద్యోగులు ఓ రెండేళ్ల కిందట సమ్మె చేశారు. దానిని కేసీయార్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. ఒక్క డిమాండ్ కూడా అమలు కాకుండానే ఆర్టీసీ కార్మికులంతా సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరిపోయారు. ఈ విషయంలో వారికి తన మీద కోపం ఇంకా ఉందనే విషయం కేసీయార్‌కు తెలుసు. అందుకే వాళ్లందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్‌ను కూడా ఆయన త్వరలోనే నియమించవచ్చు,. ఈ లోగా మధ్యంతర భృతి ప్రకటించి, ఉద్యోగుల మద్దతు కూడా పొందవచ్చు. మరిన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ మరికొన్ని విధాన నిర్ణయాలను కూడా కేసీయార్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ బాటలోనే ఏపీలో జగన్ కూడా పయనిస్తారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సారి గెలవడం జగన్‌కు అత్యంత కీలకం. విశాఖను పాలనా రాజధానికిగా మార్చాలన్నా, తెలుగుదేశాన్ని మరింత బలహీన పరచాలన్నా, తన సంక్షేమ పథకాలతో సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలన్నా మరో ఐదేళ్లు తానే అధికారంలో ఉండాలి అనేది జగన్ ఉద్దేశం. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కాకుండా మరిన్ని కొత్తవి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు అమలు చేస్తున్న కొన్ని పథకాల ఆర్థిక సాయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది.
అలాగే 2022లో ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మధ్యంతర భృతి ప్రకటించి వాళ్లను మచ్చిక చేసుకునే అవకాశం ఉంది. పట్టణాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను తక్కువ రేటుకు అందించడం ద్వారా కూడా వాళ్ల మద్దతు సంపాదించే ప్రయత్నం ఇప్పటికే మొదలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు అందని వారంతా జగన్‌పై తీవ్ర అసంతప్తి ఉన్నారు. అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే ఇటీవల విశాఖపట్నంలో ఓ పారిశ్రామిక సదస్సు ఏర్పాటు చేసి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల సమయానికి ఎన్ని పథకాలు జగన్ బుర్రలోంచి బయటకు వస్తాయో చూడాలి. ఏపీలోని వైకాపాకు, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలకు ఈ ఎన్నికలు చావో రేవో!