Thu Dec 19 2024 09:42:40 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఎగతాళి చేసినోళ్లకు సరైన ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేయనునున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి అనేది మాత్రం స్పష్టం చేయలేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేయనునున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి అనేది మాత్రం స్పష్టం చేయలేదు. నిన్న విశాఖలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను పోటీ చేసిన నియోజకవర్గంలో వైసీపీ వెయ్యి కోట్లు పెట్టయినా తనను ఓడించడానికి సిద్ధపడుతుందన్నారు. అయినా తాను భయపడబోనని అన్నారు. ఎంత ఖర్చు పెడతారో పెట్టుకోవాలని వైసీపీకి ఛాలెంజ్ విసిరారు. తాను పోటీ చేయడం గ్యారంటీ అన్న సంకేతాలను జనసైనికులకు ఇచ్చారు. వైసీపీ ఎంత ఖర్చు చేసినా తాను భయపడబోనని, తనలో ఆ ఆత్మవిశ్వాసం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారంటే ఆయన ఈసారి కూడా బరిలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తుంది.
గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలోనూ, తనకు పట్టున్న భీమవరం నుంచి ఆయన బరిలోకి దిగారు. అయితే రెండు చోట్ల ఆయన ఓటమి పాలు కావడం అప్పట్లో షాక్ కు గురి చేసింది. అయితే నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఆయన ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయితే ఈసారి టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో తన విజయం ఖాయమని నమ్ముతున్నారు. తాను ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయమని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ అక్కడి నుంచే...
తిరిగి భీమవరం నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఈసారి భీమవరంలో గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఓడిపోయిన చోటే గెలిచి చూపించాలన్న కసితో జనసైనికులున్నారు. అందుకోసమే భీమవరాన్ని మరోసారి ఎంచుకోవాలని పవన్ అభిమానులు కోరుతున్నారు. మరోవైపు తిరుపతి నుంచి కూడా పిలుపు వస్తుంది. తిరుపతి అయితే పవన్ గెలుపుకు ఢోకా ఉండదని చెబుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి తిరుపతి నుంచి గెలిచిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. పెద్దాపురం పేరు వినిపిస్తున్నా మళ్లీ ప్రయోగం చేయడం ఎందుకన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతుంది. అందుకే ఆయన ఈసారి భీమవరం, తిరుపతిల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సర్వేల తర్వాత....
ఈసారి జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం బలంగా ఉండటంతో పవన్ గెలుపు ఈసారి పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఎక్కువవుతుంది. తాను కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజాసమస్యలను ప్రస్తావించాలని, అవసరమైతే ప్రజల తరుపున ప్రశ్నించాలని పవన్ భావిస్తున్నారు. తనను ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూయించేందుకు ఖచ్చితంగా గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తొలుత సర్వేలు చేయించిన అనంతరం ఆయన ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రానుంది.
Next Story