Fri Dec 20 2024 06:05:09 GMT+0000 (Coordinated Universal Time)
TDP : పొత్తు ఖరారయింది.. సీట్లు కూడా దాదాపుగా ఫైనల్ అయినట్లేనట
జనసేన, టీడీపీ పొత్తు ఖరారయింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఖరారయింది. సీట్ల విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది
జనసేన, టీడీపీ పొత్తు ఖరారయింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఖరారయింది. రెండు పార్టీల క్యాడర్ కలసి పోరాటం చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు రాష్ట్ర స్థాయిలో ఏకమైన నేతలు ఇక జిల్లా స్థాయి నేతలను కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. పాత జిల్లాల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని రెండు పార్టీల ఉమ్మడి పోరాటంపై చర్చించాలని టీడీపీ యువనేత నారా లోకేష్ పిలుపు నిచ్చారు. ఈ నెల 29 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు జరగనున్నాయి. జిల్లాల్లో పరిస్థితులను బట్టి నేతలు జనసేన నేతలతో చర్చలు జరిపి ప్రభుత్వంపై పోరాటానికి కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నది ఈ పిలుపు లక్ష్యంగా కనపడుతుంది.
సీట్ల పంపకం మాత్రం...
అంతా ఓకే.. అయితే సీట్ల పంపకంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎవరు ఏ సీట్లలో పోటీ చేస్తారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఇటు జనసేన నుంచి అటు టీడీపీ నుంచి కూడా నేతలు కొంత టెన్షన్ కు గురవుతున్నారు. అధినేతల మనసులో మాటను మాత్రం బయట పెట్టడం లేదు. కొన్ని స్థానాల్లో మాత్రం క్లారిటీ వస్తుండటం, అక్కడ పార్టీ నేతలు రాజీనామా చేస్తుండటంతో ఇక నేతలతో పార్టీ నేతలు చెప్పడం మానుకున్నారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి నారాయణ మళ్లీ పోటీ చేస్తారని, అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని జనసేన పార్టీ నాయకత్వం అక్కడి నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డికి చెప్పినా ఆయన ససేమిరా అంటూ రాజీనామ చేసి పడేశారు. దీంతో ఇక ముందు లీక్ చేయడం మానుకున్నారు.
యాభై స్థానాలను ...
అయితే జనసేన ఈసారి యాభై స్థానాలను పొత్తులో భాగంగా కోరుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎక్కువగా ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొంత తక్కువగా సీట్లు కోరాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. జనసేన గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించి ఆ జాబితాను ఇప్పటికే జైలులో ఉన్న చంద్రబాబుకు అందించినట్లు తెలిసింది. ఆయన దీనిపై ప్రాధమికంగా పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది. యాభై కాకపోయినా కనీసం నలభై స్థానాలయినా జనసేనకు పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పవన్ పార్టీకి దూరమయ్యే అవకాశాలుంటాయి.
సీనియర్ల అభ్యంతరం...
కానీ నలభై నియోజకవర్గాల్లో పార్టీ సింబల్ లేకుండా ఉండటంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. జగన్ ను ఓడించాలన్న కసితో సీట్లను శాశ్వతంగా కోల్పోయే అవకాశాలు ఇవ్వవద్దని సూచించినట్లు తెలిసింది. సింబల్ లేకపోతే దశాబ్దకాలంగా సైకిల్ పార్టీకి ఓటేస్తున్న వారు గాజు గ్లాసు మీద ఓటు వేయడానికి మొగ్గు చూపరని, ఈసారి అక్కడ గెలిస్తే తమకు భవిష్యత్ లో సీటు రాదని భయపడిపోయి వైసీీపీకి వేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జనసేనకు ఇరవైకి మించి సీట్లు ఇవ్వడం అనవసరమన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే దీనిని ఫైనల్ చేయాల్సింది చంద్రబాబు కావడంతో ఆయనపై భారం వేయక తప్పని పరిస్థితి. ఈ ఎన్నికల్లో జనసేన అవసరం కూడా టీడీపీకి ఉంది కాబట్టి తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధం కావాల్సిందే.
Next Story