Thu Dec 19 2024 23:14:02 GMT+0000 (Coordinated Universal Time)
Tdp, Janasena : భేటీ అసలు కారణం అదేనా... అలా ముందుకు వెళ్లకపోతే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయంగా మరోసారి చర్చనీయాంశమైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ రాజకీయంగా మరోసారి చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండూ కలసి పోటీకి దిగనున్నాయి. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబును కలిసిన తర్వాత బయటకు వచ్చి పవన్ కల్యాణ్ అధికారికంగా పొత్తు విషయాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై పోరాటాలు, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలకు చెందిన క్యాడర్ కలిసి పనిచేసేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అగ్రనేతలు భావిస్తున్నారు.
రెండు పార్టీల మధ్య...
అక్కడక్కడ రెండు పార్టీల నేతల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తినా రానున్న కాలంలో సర్దుకుంటాయని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు బెయిల్ పై వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ కూడా పార్టీ ముఖ్యులకు ఉపదేశం చేశారు. టీడీపీ, జనసేనల పొత్తులపై నెగిటివ్ గా మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించారు కూడా. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో కలసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని, రాబోయే ప్రభుత్వంలో జనసేన కీలకంగా మారుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
సీట్ల కేటాయింపు...
అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో భేటీ వెనక ప్రత్యేక కారణం ఉందని భావిస్తున్నారు. ఈ నెలలోనే త్వరలో ఇద్దరూ కలసి ఒక బహిరంగ సభలో ప్రసగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో తమకు కేటాయించాల్సిన స్థానాలపై త్వరగా స్పష్టత వస్తే అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా.. అభ్యర్థుల ఎంపికను కూడా తాము పూర్తి చేసుకుంటామని జనసేన అగ్ర నాయకత్వం చెబుతోంది. ఇందుకోసమే పవన్ చంద్రబాబుతో భేటీ అయ్యారా? అన్న చర్చ సాగుతుంది. పొత్తులో తమకు కేటాయించే స్థానాలపై స్పష్టత వస్తే అక్కడ ఎక్కువ సార్లు తాను పర్యటించేలా ప్లాన్ చేసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు.
ఉమ్మడి మేనిఫేస్టోపై...
దీంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చర్చించినట్లు తెలిసింది. అలాగే బీజేపీ తమ కూటమితో కలసి వస్తుందా? రాదా? అన్న దానిపై త్వరగా ఒక క్లారిటీ వస్తే దాని ప్రకారం సీట్లను కేటాయించుకోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. ఎక్కువగా పార్లమెంటు స్థానాలను బీజేపీకి ఇచ్చి, శాసనసభ స్థానాలను ఐదు నుంచి ఆరుకు తక్కువగా ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఈ విషయం కూడా పవన్ ద్వారా బీజేపీ అధినాయకత్వానికి చేరవేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ఈ భేటీలో బీజేపీ తమతో కలసి వస్తుందా? రాదా? అన్న దానిపై స్పష్టత వస్తే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ విజయం, కేసీఆర్ ఓటమి వంటి విషయాలపై కూడా ఇరువురు చర్చించుకున్నారని తెలిసింది.
Next Story