పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. బీజేపీ, టీడీపీల మధ్యే సమస్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల షెడ్యూలు దగ్గర పడుతుండడంతో వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల షెడ్యూలు దగ్గర పడుతుండడంతో వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తుంది. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉండటంపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో టీడీపీ పార్టీ చేరి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రధానమంత్రి మోడీ కలలను సాధించడానికి కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరం అని అన్నారు. ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు హాజరవుతుండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశానికి టీడీపీని ఆహ్వానించలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగే కీలక సమావేశానికి టీడీపీని ఆహ్వానించలేదు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పవన్ అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంతో పాటు రాబోయే ఎన్నికల్లో పొత్తులు,సీఎం పదవి వంటి అంశాలపై ఎన్డీయే భేటీలో పాల్గొనడానికి ముందు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.
వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని డెవలప్ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. సీఎం ఎవరనేది సమస్య కాదని, జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటోందన్నారు. అయితే క్షేత్రస్థాయి బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఇష్యూ ఉందని వ్యాఖ్యానించిన జనసేన అధినేత.. వాళ్ల మధ్య ఉన్న సమస్యపై తాను మాట్లాడలేనని కామెంట్ చేశారు. అయితే కచ్చితంగా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని భావిస్తున్నట్టు పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది తన విధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల తరువాత తమ కూటమి విజయం సాధిస్తే.. సీఎం ఎవరనేది సమస్య కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.