Sun Nov 24 2024 06:51:08 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే : జేపీ నడ్డా
తెలంగాణలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మొదలైంది, ఇందుకు నిదర్శనం దుబ్బాక, హుజూరాబాద్ విజయాలే కారణమన్నారు. ఎంతోమంది..
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుంది అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, దీనికి బండి సంజయ్ పాదయాత్రే నిదర్శమన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఎంవీఎస్ కళాశాలలో జనం గోస - బీజేపీ భరోసా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చేసిన జేపీ నడ్డా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, రాష్ట్రంలో బీజేపీ వికశించబోతుందని అర్ధమవుతుందని అన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మొదలైంది, ఇందుకు నిదర్శనం దుబ్బాక, హుజూరాబాద్ విజయాలే కారణమన్నారు. ఎంతోమంది టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసినా ప్రజలు మాత్రం దుబ్బాక, హుజురాబాద్ విజయాలతో కేసీఆర్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారన్నారు. తెలంగాణపై మోడీ ప్రత్యేక దృష్టి సారించారని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కేంద్ర సర్కార్ కృషి చేస్తుందన్నారు. కరోనా విపత్కర సమయంలో చాలా దేశాలు చేతులెత్తేశాయని, భారత్ మాత్రం ఏమాత్రం తలొగ్గకుండా ప్రజల సహకారంతో మహమ్మారిని కట్టడి చేశామన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇచ్చిన ఏకైక దేశం భారత్ అన్నారు.
రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన కేసీఆర్ కరోనా నింబంధనలు పాటించకుండా, బండి సంజయ్ ని నిబంధనల పేరుతో అరెస్టులు చేయించారని విమర్శించారు. అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం కూరుకుపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని, పాలిచ్చే గేదెలా కేసీఆర్ కాళేశ్వరాన్ని వినియోగించుకుంటున్నారని విమర్శించారు. హరితహారంలో అవినీతి, ల్యాండ్ మాఫియా ఇలా ఎన్నో ఉన్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రాజాకార్ సమితి అంటూ నడ్డా విమర్శించారు. కేంద్రం నిధులతో కేంద్ర పథకాలను తన పేరుతో కేసీఆర్ అమలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్రను చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజలంతా ఏకం కావాలని, కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించాలని నడ్డా ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story