Sat Nov 09 2024 01:54:35 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటి ?
జూపల్లి సొంత నియోజకవర్గమైన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని అనుచరులు, అభిమానుల అభిప్రాయాలతో పాటు..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఆయన చేరిక దాదాపు ఖరారైందని జూపల్లి అనుచరగణం చెబుతోంది. జూన్ 8న జూపల్లి కృష్ణారావు.. ఆయనతో పాటు వనపర్తి జిల్లా నేతలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డిలతో పాటు మరికొంత మంది కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ లోనే చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ నుంచి బహిష్కరింపబడ్డారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సోమవారం.. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉందని చేసిన వ్యాఖ్యలు ఈ ఇద్దరి చేరికలను స్పష్టం చేశాయి.
తొలుత వీరిద్దరూ కలిసి కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కొత్త రాజకీయ శక్తిగా అవతరించి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి 10-15 సీట్లను కైవసం చేసుకోవాలనున్నారని నిన్నటి వరకూ జరిగిన చర్చ. కానీ.. ఇప్పుడీ ఆలోచన మానుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరూ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జూపల్లి సొంత నియోజకవర్గమైన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని అనుచరులు, అభిమానుల అభిప్రాయాలతో పాటు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూల్, అలంపూర్, గద్వాల, అచ్చంపేట నియోజకవర్గాల్లో జూపల్లి సపోర్టర్స్ అభిప్రాయాలతో కాంగ్రెస్ లో చేరాలన్న తుది నిర్ణయం తీసుకున్నారు. జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఆయన సన్నిహితులు, అనుచరులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
పొంగులేటి విషయానికొస్తే.. ఖమ్మంలో జూన్ 20వ తేదీ లోగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఆ సభ అనంతరం పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరికపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. జూన్ నెలాఖరులోగా ఖమ్మంలో మరో బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ముఖ్యనేతల సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలను ముందు బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ.. కర్ణాటక ఎన్నికల ఫలితంతో ఇద్దరు నేతల అనుచరులు కాంగ్రెస్ లోనే చేరాలని ఒత్తిడి చేస్తుండటంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా కాంగ్రెస్ లో చేరితేనే బాగుంటుందని పొంగులేటి స్వయంగా చేయించుకున్న సర్వేలో తెలిపారు. మొత్తానికి ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story