Mon Dec 23 2024 04:29:40 GMT+0000 (Coordinated Universal Time)
కన్నా.. కలుగులోకి.. కారణమిదేనట
కొంతకాలంగా కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా కన్పించడం లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పందన కూడా లేదు
కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. మంత్రిగా అనేక సార్లు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాపు సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్. వంగవీటి రంగా తర్వాత తాను మాత్రమే కాపు సామాజికవర్గానికి నేతగా ఆయన భావిస్తుంటారు. గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి కన్నాను వేరు చేసి చూడలేం. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన కండువా కప్పుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏమై పోయారబ్బా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయారిటీ ఇచ్చినా...
కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బాగానే ప్రయారిటీ ఇచ్చింది. ఆయన కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. చివరకు కోడెల కుటుంబాన్ని కాదని సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి టీడీపీ అధికారంలోకి వస్తే కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి గ్యారంటీ అని కూడా ఆయన అనుచరులు ఆనంద పడ్డారు. కన్నా కూడా సత్తెనపల్లిలో తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కానీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి జైలుకెళ్లి దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ ఆయనతో ములాఖత్ కాకపోవడం చర్చనీయాంశమైంది.
కీలక నిర్ణయాలలో...
కన్నా లక్ష్మీనారాయణ ఊహించింది వేరు.. జరుగుతున్నది వేరు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరయిన తర్వాత కన్నాను దూరం పెడుతున్నారని ఆయన భావిస్తున్నట్లుంది. చివరకు చంద్రబాబు జైలు కెళ్లిన తర్వాత సీనియర్ నేతగా కీలక నిర్ణయాల్లో కన్నాకు పార్టీ నేతలు చోటు కల్పించలేదు. సమావేశాలన్నీ నందమూరి బాలకృష్ణ, యనమల, అచ్చెన్నాయుడు వంటి నేతలు పాల్గొన్నా అభ్యంతరం లేదు కాని, పట్టాభి వంటి కొత్త తరం నేతలు కూడా పాల్గొని కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యులు కావడం కన్నా లక్ష్మీనారయణ వర్గం జీర్ణించుకోలేకపోతుంది. తమ నేతకు జరిగిన అవమానంగా భావిస్తుంది.
పవన్ కు ఇచ్చిన ప్రయారిటీ...
చంద్రబాబుతో సమానంగా రాజకీయ అనుభవం ఉన్న తమ నేతకు ఇలాంటి అవమానాలు మున్ముందు ఎన్ని ఎదుర్కొనాలోనన్న సందేహాలు కన్నా వర్గీయులను వెంటాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హడావిడి చేసిన జిల్లా పార్టీ నేతలు కూడా ఇప్పుడు కన్నాను పట్టించుకోవడం మానేశారంటున్నారు. కాపు సామాజికవర్గం నేతగా కన్నాను దూరంపెట్టి పవన్ కల్యాణ్ ను దగ్గరకు తీసుకోవడం పట్ల కూడా ఆయన వర్గం కొంత కినుకు వహించినట్లుంది. ఇంతకీ కన్నా పార్టీలో హ్యాపీగా ఉన్నారా? లేదా? అన్నది ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. అయితే కన్నాకు అంతకు మించి వేరే దారిలేదన్నది ఆయన ప్రత్యర్థులు సయితం అంగీకరిస్తున్నారు. టీడీపీలో చేరి కన్నా తప్పు చేశారంటూ ఆయన వర్గం నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story