Thu Dec 19 2024 15:24:51 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలకు సిద్ధు వరాల జల్లు.. సీఎం ముందు పెద్ద సవాళ్లు..
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందించేందుకు 14 వేల 430 కోట్లు ఖర్చవుతుంది. అలాగే..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం పూర్తైంది. ఆయన నేతృత్వంలో ప్రభుత్వం అనేక ఉచిత హామీల అమలు ఆరంభమైంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్ధానాలను సిద్ధరామయ్య తొలికేబినెట్ సమావేశంలోనే ఆమోదముద్ర వేశారు. ఇందులో మొదటిది ఉచిత విద్యుత్. రాష్ట్రంలో అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పదకానికి ఆమోదం తెలిపారు. అలాగే ప్రతి కుటుంబంలోని మహిళా పెద్దలకు ఆర్థిక సహాయంగా నెలకు రూ.2000 అందించనున్నారు. అంతా బాగానే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. కానీ.. వాటన్నింటికీ అంత డబ్బు ఎక్కడిది ? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న.
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు ప్రతి సంవత్సరం రూ.62 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇది రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతం. కరోనా దెబ్బకు ఇప్పటికే లోటులో ఉన్న ఖజానాపై ఉచిత హామీల బడ్జెట్ భారం కూడా పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2022-23 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ లో రెవెన్యూ లోటు రూ.14,699 కోట్లు. 2023-24 లో ఈ లోటు రూ.60,581 కోట్లుగా ఉంటుందని అంచనా.
ఉచిత హామీల కారణంగా.. రాష్ట్రంలో మూలధన వ్యయానికి నిధుల కొరత ప్రాథమిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ముందున్న సవాలు కూడా ఇదే. ప్రస్తుతం రాష్ట్రం సుమారు రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇప్పుడు రూ.2 లక్షల 26 వేల కోట్లుగా ఉన్న ఖర్చు.. హామీల అమలు తర్వాత రూ.2 లక్షల 87 వేల కోట్లు అవుతుంది. అంటే మునుపటికంటే..ఖర్చు బాగా పెరుగుతుంది.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందించేందుకు 14 వేల 430 కోట్లు ఖర్చవుతుంది. అలాగే గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3000 నిరుద్యోగ భృతికి వార్షిక వ్యయం 3 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి ఇంటిలో మహిళా పెద్దలకు నెలకు రూ.2000 ఇచ్చేందుకు ఏడాదికి రూ.30 వేల 720 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి 4-10 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇచ్చేందుకు రూ.4-5 వేల కోట్లు ఖర్చవుతుంది. ఐదో హామీ కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు, మత్స్యకారులకు ప్రతి సంవత్సరం 500 లీటర్ల డీజిల్ ఉచితంగా ఇచ్చేందుకు ఎంత ఖర్చవుతుందో ఆర్థిక నిపుణులు అంచనా వేసే పనిలో ఉన్నారు. అసలే లోటు బడ్జెట్.. పైగా కొత్త ప్రభుత్వం.. ఈ హామీలకు డబ్బులెక్కడివి అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏదేతేనేం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు కదా అనేది ప్రజల అభిప్రాయం
Next Story