Thu Nov 07 2024 19:34:19 GMT+0000 (Coordinated Universal Time)
KCR : బాస్ వచ్చేస్తున్నాడు..బీ రెడీ... ఇక కాసుకోండి అంటున్నారుగా
కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి నెలలో జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో జనం ముందుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పర్యటనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను భారీగా జరిపేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు. అదే రోజు ఆయన తెలంగాణ భవన్ కు రానున్నారని తెలిసింది. పార్టీ రాష్ట్రంలో ఓటమి తర్వాత ఆయన ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వెళ్లారు. అక్కడ కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో ఆయన నందినగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో...
ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో అంతా కేటీఆర్ పార్టీ వ్యవహరాలను చూసుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో దాని బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. కేసీఆర్ సూచనల మేరకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహించి అధినేతకు నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించి పార్టీ పైనా, ప్రతిపక్షాలపైన పట్టు నిలుపుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకే సిట్టింగ్ ఎంపీలలో చాలా మందికి ఈసారి సీట్లు దక్కవని చెబుతున్నారు. కొత్త వారిని ఎంపిక చేయడానికి ఆయన నిర్ణయించారు.
కవితకు నో టిక్కెట్...
చివరకు తన కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా పక్కన పెట్టేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. నిజామాబాద్ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సామాజికవర్గాల సమీకరణాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, అందుకోసం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటూనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కసరత్తులు చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కొందరికి పార్టీ పదవులు ఇచ్చి సంతృప్తి పర్చడంతో పాటుగా మరికొందరికి పార్లమెంటుకు పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. అందుకు ముందుగా క్యాడర్ ను సమాయత్తం చేయాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
ఉత్సాహం నింపేందుకు...
నిరాశలో ఉన్న క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ఆయన త్వరలో జిల్లాల పర్యటనలు చేయనున్నట్లు తెలిసింది. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. నేతల కంటే క్యాడర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలను బలంగా కిందిస్థాయికి పంపేందుకు ఆయన ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలు, ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశమవుతారని కూడా పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ జిల్లా పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారట... గులాబీ బాస్ వచ్చేస్తున్నారు.. బీ రెడీ అంటున్నాయి పార్టీ వర్గాలు.
Next Story