Fri Nov 22 2024 16:44:52 GMT+0000 (Coordinated Universal Time)
Konathala : మూడు దశాబ్దాల తర్వాత విజయం కోసం ఎదురు చూపులు... నిజాయితీ గల నేత నిరీక్షణ
వచ్చే ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ జనసేన నుంచి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు
కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఆయన గెలిచింది మూడు సార్లు మాత్రమే. అంటే విజయంలో ట్రాక్ రికార్డు మాత్రం అంత బాగా లేదనే చెప్పాలి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు, అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి ఒక్కసారి మాత్రమే కొణతాల రామకృష్ణ గెలిచారు. 1989, 1991 లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతే తప్ప ఈయన రాజకీయ జీవితంలో గెలుపు కంటే ఓటములే ఎక్కువ.
వివాదాలకు దూరంగా...
అయితే కొణతాల రామకృష్ణ విభిన్నమైన వ్యక్తిత్వమున్న నేత. ఆయన వివాదాల జోలికి పోరు. అలాగే అవినీతి మచ్చ అనేది ఆయన రాజకీయ జీవితంలో అంటనూ లేదు. నెమ్మదైన స్వభావం. ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకే ఆయన ప్రయత్నిస్తారు. ఆత్మగౌరవంతో మెలిగే నేతగా ఉత్తరాంధ్రలో మాత్రమే కాదు రాష్ట్రమంతటా పేరుంది. ఏమాత్రం తనకు నచ్చకుంటే వెంటనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరి ఇమడలేకపోయారు. దాని నుంచి బయటకు వచ్చిన కొణతాల తర్వాత దాదాపు దశాబ్దకాలం నుంచి రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నా ఏ పార్టీలోనూ చేరలేదు.
వ్యక్తిత్వంలో మాత్రం...
తాజాగా జనసేన పార్టీలో చేరిన వ్యక్తిత్వపరంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆయనకు పవన్ కల్యాణ్ నుంచి అనకాపల్లి టిక్కెట్ హామీ లభించిందని చెబుతున్నారు. అయితే కొణతాల రామకృష్ణ ను అదృష్టం లేని నేతగా భావిస్తారు. 1989లోనూ ఆయన అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అప్పలనరసింహంపై కేవలం తొమ్మిది ఓట్ల తేడాతోనే గెలిచారు. బహుశ ఇంత తక్కువ ఓట్లతో గెలిచిన వాళ్లు దేశంలోనే లేరు. ఇక 1991లోనూ అదే అభ్యర్థిపై అనకాపల్లి నుంచి పోటీ చేసి కేవలం 11 వేల మెజారిటీతోనే విజయం సాధించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇది కూడా పెద్ద మెజారిటీ కాదనే చెప్పాలి. అలా కొణతాల రామకృష్ణ లాంటి నేత కేవలం మూడు సార్లు మత్రమే చట్టసభల్లోకి కాలు పెట్టారు.
సహకరిస్తారా?
రాజకీయాల్లోకి ప్రవేశించి నలభై ఏళ్లు కావస్తున్నా ఆయన పదిహేనేళ్లు మాత్రమే చట్టసభల్లో ఉన్నారంటే ఆయనకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు. కానీ ఈసారి తన అదృష్టాన్ని ఆయన గాజు గ్లాసుతో పరీక్షించుకోదలచుకుంటున్నారు. అనకాపల్లి పార్లమెంటు వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోయినా మంత్రి గుడివాడ అమర్నాధ్ పేరు వినిపిస్తుంది. కొణతాల కు టీడీపీ నేతలు సహకరిస్తారా? లేదా? అన్నది కూడా ఇక్కడ కొంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అటు అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ పాత్రుడిని అక్కడి నుంచి పోటీ చేయాాలని భావించారు. మరోవైపు దాడి వీరభద్రరావు గ్యాంగ్ కూడా ఈయనకు సహకరిస్తుందా? లేదా? అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. మరి కొణతాలకు ఈసారైన లక్కు దరిచేరుతుందా? లేదా? అన్నది మాత్రం వెయిట్ చేయాల్సిందే.
Next Story