Mon Dec 23 2024 17:58:28 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలతో లగడపాటి చర్చలు.. కొత్త ట్విస్టులు ఏమీ ఉండవు కదా..!
విజయవాడ నుండి 2సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం తీసుకున్న..
విజయవాడ : కాంగ్రెస్ సీనియర్ నేత,విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ తో భేటి కావడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఏపీలో విజయవాడ నుండి 2సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2019 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన సర్వే కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆయన ఇచ్చిన సర్వే ఫలితాలు ఘోరంగా బెడిసికొట్టడంతో ఇక సర్వేల జోలికి కూడా పోనని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కూడా అడపాదడపా కనిపించడం తప్పితే పెద్దగా రాజకీయంగా వార్తల్లో నిలవలేదు ఆయన..! లగడపాటి మళ్లీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేను కలవడం హాట్ టాపిక్ అయింది. లగడపాటి వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చర్చ జోరుగా నడుస్తుంది. ఇందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. లగడపాటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో ఉన్న అనుబంధం కారణంగా ఆయన వైసీపీలో చేరే అవకాశాలను కొట్టి పారేయలేము.
రాష్ట్ర విభజన తరువాత విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీ నుండి గెలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన పోట్లూరి వరప్రసాద్ ఓడిపోయిన తరువాత సైలెంట్ అయ్యారు. విజయవాడ ఎంపీగా పవర్ ఫుల్ లీడర్ కోసం వైసీపీ వెతుకుతుంది. అయితే 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు గెలవడం కోసం లగడపాటిని వైసీపీలోకి తీసుకుంటారనే చర్చ నడుస్తోంది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడ టీడీపీతో ఉన్న విభేదాల కారణంగా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఓ వైపు ఉండగా.. మరో వైపు దేవినేని ఉమాకు గట్టిప్రత్యర్ధి అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ తో లగడపాటి భేటి అయ్యారని తెలుస్తోంది. శనివారం నందిగామలో జరిగిన ఓ కార్యక్రమానికి హజరైన నేతలు కొద్దిసేపు విడిగా భేటి అయ్యారు. తరువాత ఇద్దరు కలిసి భోజనం కూడా చేశారు. తమ భేటికి అంత ప్రాధాన్యత లేదని.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, కొత్త మంత్రివర్గ విస్తరణ మీద చర్చ మాత్రమే జరిగిందని లగడపాటి వైసీపీలోకి రావడం మీద ఎలాంటి చర్చ జరుగలేదని వైసీపీ ఎమ్యెల్యే స్ఫష్టం చేశారు.
Next Story