Mon Dec 23 2024 05:39:31 GMT+0000 (Coordinated Universal Time)
Congress : చింతాపై కాంగ్రెస్ నేతలు గరం గరం
మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును వెనకేసుకొస్తూ కాంగ్రెస్, టీడీపీ కలవాలని కోరుకుంటున్న చింతామోహన్ వ్యాఖ్యలను కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా చింతా మోహన్ చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని చెబుతున్నారు. అంత వరకూ ఓకే గాని, చంద్రబాబు నిర్దోషి అన్నట్లు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
హైకమాండ్ దృష్టికి...
చంద్రబాబుపై చింతా మోహన్‌కు అంత ప్రేమ ఎందుకని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న ఆయన కామెంట్స్‌ను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని రాజమండ్రి జైలులో పెట్టడం తప్పని, చంద్రబాబు ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా? అని చింతా మోహన్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ కుట్ర ఉందన్న ఆయన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బాబు మాత్రం...
కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు బీజేపీ మద్దతు కోరుకుంటుంటే.. మనం ఎందుకు సపోర్టుగా ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించి వదిలేస్తే సరిపోతుందని, అదే పనిగా ప్రతిరోజూ చింతామోహన్ చంద్రబాబుకు అనుకూల ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత అసలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. మళ్లీ బీజేపీ వైపునకే ఆయన మొగ్గు చూపారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఇంత స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆలోచన...
అయితే చింతామోహన్ ఆలోచన మరోలా ఉందన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను గెలవాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారని, అందుకే ఆయన గత కొద్ది రోజులుగా బాబు నామస్మరణ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీలో చేరితే నేరుగా చేరవచ్చు కాని, కాంగ్రెస్ లో ఉండి మాజీ పార్లమెంటు సభ్యుడిగా చంద్రబాబును ప్రతి రోజూ వెనకేసుకు రావడం వల్ల పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మొత్తం మీద చింతా మోహన్ ఆలోచన ఎలా ఉన్నా ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం పార్టీలో కాక రేపుతున్నాయనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.
Next Story