Fri Nov 22 2024 20:07:38 GMT+0000 (Coordinated Universal Time)
Bhuvaneswari : అందుకే భువనేశ్వరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారా?
గతంలో ఎన్నడూ లేని విధంగా నారా భువనేశ్వరి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ చంద్రబాబు గెలుపునకు కృషి చేస్తున్నారు
నారా భువనేశ్వరి...ఎన్టీఆర్ కుమార్తెగానే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి. లోకేష్ తల్లి.. అంతకు మించి బాలకృష్ణ సోదరి.. బ్రాహ్మణి అత్తగారు.. అవే ఆమెకు ఇప్పటి వరకూ ఉన్న ట్యాగ్లైన్లు. కేవలం వ్యాపారాలకే పరిమితమయ్యే వారు. ఏనాడూ రాజకీయాల జోలికి వచ్చేవారు. తన తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, భర్త చంద్రబాబు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏనాడూ ఆమె రాజకీయాల జోలికి రాలేదు. అసలు పాలిటిక్స్ గురించి ఆమెకు తెలియదనే అనుకున్నారంతా. ఎందుకంటే ఎప్పుడూ బయటకు వచ్చే మహిళ కాదు. కేవలం కుటుంబ పరమైన బాధ్యతలను నిర్వహించే ఒక మహిళగా ఆమెకు గుర్తింపు ఉంది.
సమర్థవంతమైన పారిశ్రామికవేత్తగా...
అంతేకాదు హెరిటేజ్ ఫుడ్స్ ను సమర్థవంతంగా నడిపిన పారిశ్రామికవేత్తగా కూడా ఆమెకు పేరుంది. హెరిటేజ్ సంస్థలను కొన్నేళ్లుగా చూసుకుంటున్నా ఆమె ఎప్పుడూ ఏపీ రాజకీయాల జోలికి రాలేదు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె అప్పుడప్పుడు సీఎం నివాసానికి వచ్చి వెళ్లారు తప్ప పూర్తి కాలం విజయవాడలోనూ ఉండింది లేదు. ఒకరకంగా చెప్పాలంటే భువనేశ్వరికి రాజకీయాలంటే ఆమెకు గిట్టదనే అనుకోవాలి. తన సోదరి పురంద్రీశ్వరి వేర్వేరు పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ ఆమెను ఒక సోదరిగానే చూశారు తప్ప రాజకీయ చర్చలు కూడా ఎప్పుడూ జరిపింది లేదు.
మొన్నటి వరకూ కుప్పం వరకే...
అలాంటి పురంద్రీశ్వరి గత ఏడాది కాలంగా ఏపీ రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కుప్పం బాధ్యతలను మాత్రం ఆమె చూసుకుంటారు. కేవలం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తరుపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబు టీడీపీ అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించాల్సి రావడంతో భువనేశ్వరి కుప్పంలో చంద్రబాబు గెలుపు కోసం శ్రమిస్తూ వచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని తన అత్తవారిల్లుగా భావించి దానినే కార్యక్షేత్రంగా చేసుకుని ఎన్నికల సమయంలోనే ఆమె ప్రచారం చేస్తూ వస్తున్నారు. అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలకు మాత్రం చంద్రబాబుకు తోడుగా వచ్చి మద్దతుగా నిలిచారు. అంతకు మించి టీడీపీతో ఆమెకు ప్రత్యక్ష సంబంధం ఏదీలేదనే చెప్పాల్సి ఉంటుంది.
ఏడాది నుంచి...
కానీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి భువనేశ్వరి ఒక రకంగా టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఎలాగంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా ఒక్కటేమిటి అన్ని జిల్లాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఒకరకంగా పార్టీ కోసమే కాకుండా తన భర్త చంద్రబాబు, కుమారుడు లోకేష్ రాజకీయాలకు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మదర్ సెంటిమెంట్ తోనూ, ఫ్యామిలీ అటాచ్మెంట్ కోసం ఆమె ఈసారి టీడీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగానే శ్రమిస్తున్నారు. మరి భువనేశ్వరి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story