Fri Nov 22 2024 11:38:49 GMT+0000 (Coordinated Universal Time)
Asaduddin Owaisi : అసద్ భాయ్.. ఏపీ వైపు చూడరా? ఆ ధైర్యం లేదా?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దింపుతారు. మరి ఏపీలో చేయనును్నారా? లేదా?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎక్కడ ఎన్నికలు జరిగినా పతంగి పార్టీని పోటీలో నిలిపేందుకు సిద్ధపడుతుంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతుంటారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. దీనికి కారణాలపై పెద్దయెత్తున రాజకీయ చర్చ జరుగుతుంది. ఎంఐఎం ఫక్తు సామాజికవర్గాన్ని నమ్ముకుని పెట్టిన పార్టీ. తెలంగాణలోనూ ఏడు స్థానాల్లో గ్యారంటీ గెలుపు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం కూడా ఎప్పుడూ దాని సొంతమే. తెలంగాణలో ఉన్న ఆ పార్టీని క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు అసదుద్దీన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అనేక రాష్ట్రాల్లో...
బీహార్ లో కొన్ని స్థానాల్లో గెలిచి పతంగి పార్టీ అక్కడి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు సమర్థవంతంగా గండికొట్టకలిగింది. ఉత్తర్ప్రదేశ్ లో పోటీ చేసినా ఫలితం లేదు. గుజరాత్ లోనూ పెద్దగా కలసి రాలేదు. ఇక మహారాష్ట్రలో మాత్రం కొన్ని స్థానాల్లో గెలిచి అసెంబ్లీలో కాలుమోపింది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేసింది. వీలయితే తమతో కలసి వచ్చే పార్టీలను కలుపుకుని పోతూ బరిలోకి దింపుతూ కొన్ని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తూ ఆ యా రాష్ట్రాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఏపీలో మాత్రం...
అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎంఐఎం కాలుమోపలేకపోతుంది. అక్కడ ముస్లిం ఓటర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు తూర్పు నియోజకవర్గం, కదిరి, కర్నూలు పట్టణం వంటి స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మైనారిటీలు ఎక్కువగా వైసీపీ పక్షాన నిలుస్తున్నారు 2014, 2019 ఎన్నికల్లో అదే జరిగింది. జగన్ పార్టీ అభ్యర్థులు ముస్లిం ప్రభావితం చూపే నియోజవర్గాలలో గెలుపొందారంటే అందుకు అదే ఉదాహరణ. టీడీపీ బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవడంతో ఆ ఓటు బ్యాంకులో ఎక్కువ స్థానం జగన్ కైవసం చేసుకున్నారు.
మంచి మిత్రుడిగా...
కానీ గత ఐదేళ్ల నుంచి ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి దన్నుగానే నిలుస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో పెట్టే బిల్లులకు మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ ఈసారి ఏపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒవైసీీ ఏపీలో పర్యటించేది కూడా తక్కువగానే ఉంటుంది. పైగా వైఎస్ జగన్ తో అసదుద్దీన్ ఒవైసీ మంచి మిత్రుడిగా ఉంటున్నారు. ఈ సమయంలో ఎంఐఎం అధినేత పోటీ చేసి వైసీపీ అనుకూల ఓట్లు చీల్చనున్నారా? లేక మౌనంగా ఉంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద పతంగి పార్టీ ఏపీ ఎన్నికల్లో పాల్గొంటుందా? లేదా? అన్న దానిపై అసదుద్దీన్ మాత్రమే స్పష్టం చేయాల్సి ఉంది.
Next Story