Fri Nov 22 2024 21:02:42 GMT+0000 (Coordinated Universal Time)
Adimulapu Suresh : నాలుగు ఎన్నికలు.. మూడు నియోజకవర్గాలు.... ఇదేంది బాసూ?
మంత్రి ఆదిమూలపు సురేష్ నాలుగు ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలలో పోటీ చేయడం చర్చనీయాంశమైంది.
వరైనా ఒక నియోజకవర్గంలో ఒకసారి ఎన్నికయితే అక్కడ ప్రజలతోనూ, క్యాడర్ తోనూ పెనవేసుకు పోతారు. అక్కడి నుంచి ఎన్నికల్లో ఓటమి పాలయినా సరే.. నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. అంతగా ఆ ప్రాంతంతో తన బంధాన్ని పెనవేసుకుపోతుంటారు. కానీ కొందరు రాజకీయ నేతలకు మాత్రం ఒకసారి గెలచిన నియోజకవర్గం మరొకసారి అచ్చిరాదు. అంటే అక్కడ ప్రజలు, క్యాడర్ కూడా తనకు అండగా నిలబడరు. టీడీపీలో గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాలకు మారుస్తుంటారని చెబుతారు. ఆయన ఒకసారి పోటీ చేసి గెలిచిన నియోజకవర్గంలో మరొకసారి పోటీ చేయరు. అలాగే ఇప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా అంతే.
ఐదేళ్లు మంత్రిగా...
ఆయన నిర్ణయమో.. పార్టీ డెసిషనో తెలియదు కాని... 2009 నుంచి వచ్చే ఎన్నికల వరకూ వరసగా మూడు నియోజకవర్గాలను మార్చి రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. జగన్ మంత్రి వర్గంలో తొలి నుంచి ఇప్పటి వరకూ కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న ఆదిమూలపు సురేష్ దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లో కాంగ్రెస్ తరుపున యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ను సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అప్పడు అధికారంలోకి రాలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినప్పటికీ ఆదిమూలపు సురేష్ మాత్రం జగన్ చేతిని వదలలేదు. అదే సురేష్ కు ప్లస్ పాయింట్ అయింది.
ప్రతి ఎన్నికకూ...
అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్ ను మళ్లీ యర్రగొండపాలెంకు జగన్ షిఫ్ట్ చేశారు. సంతనూతలపాడులో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు రావడంతో ఆదిమూలపు సురేష్ ను తిరిగి యర్రగొండపాలెంకు పంపారు. అక్కడి నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ ను జగన్ కేబినెట్ లో కొనసాగించారు. అయితే ఈసారి విద్యాశాఖ కాకుండా మున్సిపల్ శాఖకు మార్చారు. తన సొంత జిల్లా అయిన కడపకు ఆయనను ఇన్ఛార్జి మంత్రిగానూ జగన్ నియమించారు. అలా ఆదిమూలపు సురేష్ కు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ నియోజకవర్గాలను మారుస్తున్నా మూడుసార్లుగా ఆయనను విజయమే వరించింది.
నాలుగోసారి కూడా...
ఇప్పుడు నాలుగోసారి జరగనున్న ఎన్నికల్లో కొండపి నియోజకవర్గానికి జగన్ మార్చారు. కొండపి నియోజకవర్గం కూడా ఎస్.సి నియోజకవర్గం. అక్కడ వైసీపీ ఇంత వరకూ గెలవలేక పోయింది. యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ పై కొంత వ్యతిరేకత రావడం, అక్కడ నేతలు వచ్చే ఎన్నికల్లో సురేష్ కు మద్దతుగా పనిచేయబోమని చెప్పడం వంటి కారణాలతో ఈసారి కొండపి నియోజకవర్గానికి మార్చారు. ఎస్సీ నియోజకవర్గాలు కావడంతో అక్కడి నేతలతో సఖ్యతగా మెలగకపోవడంతో పాటు అక్కడ ఉన్న అగ్రకులాలకు చెందిన నేతలతో సర్దుకు పోలేకపోవడం వంటి కారణాలతో ఆయన నియోజకవర్గాలు మార్చాల్సి వస్తుంది. కానీ ఆదిమూలపు సురేష్ నియోజకవర్గాలు మార్చినా గెలుస్తూ వస్తుండటం ఆయనకు పార్టీకి కలసి వస్తుందనే చెప్పాలి. మరి ఈసారి కొండపి నుంచి గెలిస్తే మాత్రం ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు నాలుగు వైపులా గెలిచినట్లే అవుతుంది.
Next Story