విడివిడిగా ఉన్నా.. ఇద్దరూ ఒకటే : మంత్రి అంబటి
చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌ల ఇళ్లకు మధ్య రహస్య మార్గాలు ఎప్పటో నుంచో ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌ల ఇళ్లకు మధ్య రహస్య మార్గాలు ఎప్పటో నుంచో ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వారు విడి విడిగా జీవిస్తున్నా కలిసే ప్రయాణం చేస్తున్నారంటూ సెటైర్ వేశారు. దీన్ని ఏదో విధంగా హైలెట్ చేసేందుకు ఎల్లో మీడియా తాపత్రయ పడుతోందన్నారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అవుతున్నా, చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌లకు ఏపీలో ఇళ్లు లేవని అన్నారు. వారికి స్వరాష్ట్రంలో సొంత ఇళ్లు లేవు కానీ.. ఒకరికొకరు వత్తాసు పలుక్కుంటారని అన్నారు. రామోజీరావు డైరెక్షన్లో.. చంద్రబాబు నిర్మాతగా.. వాలంటీర్ వ్యవస్థపై పవన్‌తో ఇష్టమొచ్చినట్టు మాట్లాడించారని మండిపడ్డారు. ఒక వ్యవస్థ మీద అన్యాయంగా, అక్రమంగా దుర్భాషలాడితే, ఆ వ్యవస్థ పరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ మొదట మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్ వ్యవస్థ పని చేస్తోందని ఇన్‌డైరెక్ట్‌గా అన్నారని, ఇప్పుడేమో వ్యక్తిగత డేటా అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, దీనిపై బురద జల్లాలని, నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మాంత్రి వివేకా హత్య కేసులో చంద్రబాబు, పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. ఛార్జిషీట్లోని అంశాలను జడ్జిమెంట్‌లాగా భావించి బురద జల్లాలని చూస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లినా.. పవన్ చంద్రబాబు ఇంటికి వెళ్లినా.. చివరకు ఇద్దరు వెళ్లాల్సింది ఇంటికే అంటూ విమర్శించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే వైఎస్ జగనే అని అన్నారు. సీఎం జగన్ మీటింగ్‌లకు ప్రభుత్వ డబ్బును ఖర్చుపెట్టి.. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారని, ప్రభుత్వ డబ్బుతో మీటింగ్ పెట్టి చంద్రబాబు ప్రధాని మోదీని విమర్శించినప్పుడు ఏం చేశారని మంత్రి అంబటి ప్రశ్నించారు. తన మీద కన్నా లక్ష్మీ నారాయణ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వస్తాద్ అని చంద్రబాబు పంపిస్తే.. భిక్షం ఎత్తేవారిలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పేరును చెడగొట్టడానికి కాదు.. వైఎస్ఆర్ పేరును వెయ్యిరెట్లు పెంచడానికి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని మంత్రి అంబటి అన్నారు.