ప్రీ పోల్స్‌పై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని, తాము అయితే బలంగానే ఉన్నామని, వేరే పార్టీల గురించి తమకు అవసరం లేదని అన్నారు. అలాగే ఏపీలో ముందస్తు ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలపై మంత్రి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైఎస్ఆర్సీపీకి లేదన్నారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయన్నారు.
చంద్రబాబుకు ఊతకర్ర లేకపోతే రాజకీయంగా నిలబడలేరని అన్నారు. అందుకే అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు చర్చలు జరిపారని సెటైర్ వేశారు. సీఎం జగన్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటీని నెరవేర్చారని అన్నారు. అటూ 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేసిందో అందరికీ తెలుసన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఒక్క హామీని కూడా నెరవేర్చని టీడీపీ.. మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిందని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఒంటరి పోరే చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 2019లో సాధించిన విజయమే.. 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా.. వైసీపీని ఏం చేయలేరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. అబద్ధపు హామీలతో కలిపి చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని మంత్రి విమర్శించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చంద్రబాబు విమర్శించారని.. ఇప్పుడు టీడీపీ ‘ఆల్ ఫ్రీ’ అంటూ తమ మేనిఫెస్టో తీసుకొచ్చిందని సెటైర్ వేశారు.