Mon Dec 23 2024 02:03:30 GMT+0000 (Coordinated Universal Time)
Rk Roja : రోజాను కూడా తప్పిస్తారా..? ప్రత్యర్థులదే పైచేయి అవుతున్నట్లు కనపడుతుందిగా
మంత్రి ఆర్కే రోజాకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశాలు కన్పించడం లేదు
మంత్రి ఆర్కే రోజాకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశాలు కన్పించడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి రోజాను తప్పించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. వైసీపీ హైకమాండ్ త్వరలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రోజాను తప్పించి మరొక స్థానాన్ని కేటాయిస్తారా? లేదా పూర్తిగా పక్కన పెడతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రోజాకు టిక్కెట్ కేటాయించకపోవడం వెనక ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి ఒత్తిడితో పాటు నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్తి, సొంత క్యాడర్ నుంచి వినిపిస్తున్న థిక్కార స్వరాలు ఆమెను టిక్కెట్ కు దూరం చేశాయని అంటున్నారు.
టీడీపీలో ప్రారంభించి....
ఆర్కే రోజా సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు. తొలుత తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజా తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఫైర్ బ్రాండ్ లీడర్ గా టీడీపీలోనే ముద్ర పడింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో జగన్ నాయకత్వాన్ని ఆమె సమర్థిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలవలేదు. 2009లో రోజాకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ను తెచ్చుకున్న రోజా గెలుపొందారు. దీంతో తొలిసారి ఆర్కే రోజా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది.
గ్రూపులు కట్టి...
మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో రోజా అప్పటి ప్రభుత్వం టీడీపీపై నిప్పులు చెరిగేవారు. అసెంబ్లీ సమావేశాల్లో వీరంగం చేసేవారు. దీంతో ఆర్కే రోజాను అప్పటి ప్రభుత్వం శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. అదే రోజాకు అనుకూలంగా మారింది. 2019 ఎన్నికల్లో తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. అయితే జగన్ తొలి మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. ఆమెను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా జగన్ నియమించారు. అయితే రెండో విడత విస్తరణలో రోజాను టూరిజం శాఖ మంత్రిగా జగన్ బాధ్యతలను అప్పగించారు. అయితే నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీలోనే కొందరు గ్రూపులు కట్టారు. వీరి వెనక మంత్రులు ఉన్నారని రోజాయే జగన్ వద్ద మొరపెట్టుకున్నారు.
వ్యతిరేకంగా గళాలు...
రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాన్ని ఎగదోస్తూ మంత్రులు ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తాజాగా టిక్కెట్లు ఖరారు చేసే సమయంలో రోజాకు వ్యతిరేకంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. రోజా సోదరుడు కుమారస్వామి తమ వద్ద పదవి ఇప్పిస్తారంటూ డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలకు బహిరంగంగా దిగారు. దీని వెనక కూడా మంత్రులు ఉన్నారని రోజా అంటున్నారు. ఇటు నియోజకవర్గంలో క్యాడర్ నుంచి వినిపిస్తున్న వ్యతిరేకతతో పాటు, అటు బలమైన మంత్రి రోజాకు సీటు ఇవ్వవద్దని పట్టుపట్టడంతో రోజాకు ఈసారి టిక్కెట్ దక్కడం కష్టమేనని అంటున్నారు. మరి జగన్ చివరకు రోజా కు టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
Next Story