అవసరమైతే వైసీపీకి గుడ్‌బై చెప్తా: పిల్లి సుభాష్
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరాయి.
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణుగోపాల కృష్ణ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి వేణుపై ఇప్పటికే బోసు వర్గం ఇప్పటికే తిరుగుబావుటా ఎగరవేసింది. తాజాగా రామచంద్రపురం టికెట్ అంశంపై సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణను మళ్లీ అసెంబ్లీకి పోటీకి దింపితే తాను పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సుభాష్ చంద్రబోస్ ఆదివారం అన్నారు.
కాకినాడకు సమీపంలోని రామచంద్రాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వేణుగోపాల కృష్ణ పట్ల పార్టీ కార్యకర్తలు, క్యాడర్ సంతోషంగా లేరన్నారు. ఒక వేళ వేణుకు టికెట్ కేటాయిస్తే.. తాను పార్టీలో కూడ ఉండనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుండి పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. “క్యాడర్ దగ్గర వేణు ఎన్ని రోజులు నటిస్తారు. మేము అతని బానిసలం కాదు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ నాకు, వేణుకు మధ్య సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. నేను క్యారెక్టర్ లేని వ్యక్తితో కూర్చోనని చెప్పాను” అని బోస్ అన్నారు.
అయితే ఇలా బహిరంగంగా మంత్రిపై అదే పార్టీకి చెందిన ఎంపీ విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరువురి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు పిల్లి సుభాస్ సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇటీవల వెంకటయ్యపాలెంలో బోస్ వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాము చంద్రబోస్‌పై అభిమానంతో మంత్రి వేణును గెలిపించామని, అలాంటి తమపైనే రౌడీషీటర్ తెరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.