Sat Nov 23 2024 01:15:37 GMT+0000 (Coordinated Universal Time)
Nara bhuvaneswrai : కరకట్ట కొచ్చి కర్ర పెత్తనం చేయని "అమ్మ" నేడు
రేపటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడుతున్నారు. తొలిసారి ఆమె జనంలోకి రానున్నారు
నిన్నటి వరకూ ఆమె ఒక గృహిణి. అంతే కాదు ఒక పరిశ్రమను నడిపించే పారిశ్రామిక వేత్త కూడా. ఇల్లు.. ఆఫీసు అంతే ఆమె జీవితం. కానీ నలభై నాలుగు రోజుల క్రితం అంతా తలకిందులయింది. ఏళ్లుగా ఉంటున్న ఇంటిని వదిలేసి బయటకు వచ్చారు. రేపటి నుంచి జనంలోకి వెళుతున్నారు. రాజకీయం అంటేనే గిట్టని ఆ మహిళ నేడు అనివార్య పరిస్థితుల్లో జనం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఆమె నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ కుమార్తెగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిగా మాత్రమే ఇప్పటి వరకూ ఆమె అందరికీ తెలుసు.
రాజమండ్రిలోనే మకాం...
నలభై మూడు రోజుల క్రితం తన భర్త చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆమె హైదరాబాద్లోని తన సొంత ఇంటికి దూరమయ్యారు. నలభై మూడు రోజుల నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు. తన భర్త నిర్దోషిగా త్వరగా బయటకు రావాలని ఎక్కని మెట్టు లేదు. మొక్కని గుడి లేదు. చంద్రబాబుకు రోజూ భోజన పంపే ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడంతో పాటు తరచూ ములాఖత్ అవుతూ ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడం కోసం ఆమె రాజమండ్రిని వదిలిపెట్టకుండా అక్కడే ఉన్నారు.
ఎప్పుడూ బయటకు రాని...
కానీ చంద్రబాబు సూచన మేరకు ఆమె పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపేందుకు రేపటి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తొలిసారి జనంలోకి రానున్నారు. తన తండ్రి ఎన్టీర్ గాని, భర్త చంద్రబాబు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్లు ఎప్పుడూ ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అసలు ఆ దిశగా కూడా ఆమె ఆలోచన చేయలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అమరావతికి మకాం మార్చినా ఆమె హైదరాబాద్ కే పరిమితమయ్యారు తప్ప కరకట్ట ఇంటికి వచ్చి కర్ర పెత్తనం చేయలేదు. అలాంటి భువనేశ్వరి తొలిసారి తన భర్త జైలుకెళ్లడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆమె ఆయన బాటను ఎంచుకున్నారు.
నిజం గెలవాలంటూ...
చంద్రబాబు సొంత ప్రాంతమైన నారా వారిపల్లి నుంచే ఆమె "నిజం గెలవాలి" అంటూ బస్సు యాత్రను రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. ప్రజల నుద్దేశించి ఆమె ఎప్పుడూ ప్రసంగించలేదు. ఇప్పుడిప్పుడే దానికి అలవాటు పడుతున్నారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేయడంతో గుండెలాగిన కుటుంబాలను పరామర్శించేందుకు ఒక తల్లిగా బయలుదేరారు. ఆమె కుటుంబాలను ఓదార్చనున్నారు. కార్యకర్తల్లో భరోసా నింపనున్నారు. ఆమె బస్సుయాత్ర నారా వారి పల్లె నుంచి ప్రారంభం కానుంది. తొలి సభ చంద్రగిరి నియోజకవర్గంలో జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సును తయారు చేశారు. అందులోనే నారా భువనేశ్వరి యాత్ర చేపట్టనున్నారు.
Next Story