Mon Dec 23 2024 09:18:15 GMT+0000 (Coordinated Universal Time)
BRS : అరవై రోజుల్లో ఎంత తేడా...? నాడు నేతపై నమ్మకం.. నేడేమో?
విజయం సాధిస్తే ఆ క్రెడిట్ పార్టీ అధినేతకే దక్కుతుంది. అదే ఓటమి పాలయితే.. మాత్రం ఆ నేతపై నమ్మకం సన్నగిల్లిపోతుంది
రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ పార్టీ అధినేతకే దక్కుతుంది. అదే ఓటమి పాలయితే.. మాత్రం ఆ నేతపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. జాతీయ పార్టీలు అయినా.. ప్రాంతీయ పార్టీలు అయినా ఒక్కటి మాత్రం నిజం. పార్టీ అధినేత ఖాతాలోకే గెలుపు, ఓటముల క్రెడిట్లు చేరిపోతాయి. బీజేపీ గెలిస్తే మోదీ వల్ల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ వల్లననేని అందరూ విశ్వసిస్తారు. అలాగే బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ వల్ల గెలిచిందంటారు. ఆయన వ్యూహాలకు సలాం కొడతామంటారు. ఆయన నివాసానికి క్యూ కడుతుంటారు. కేసీఆర్ వీరుడు.. శూరుడు.. విక్రమార్కుడు అంటూ ప్రశంసలు కురిపిస్తారు.
మొన్నటి వరకూ...
మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఆయన కంటే గొప్పోడు మరొకరు లేరన్నారు. ఆయన వ్యూహాలకు మరే రాజకీయ నేత ఆలోచనలకు సాటి రావన్నారు. స్కెచ్ వేస్తే సెటిల్ అయినట్లేనని అనే వీర ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందుకే కేసీఆర్ మా నాయకుడు అంటూ చొక్కా బటన్లు విప్పి మరి చెప్పుకున్నారు. కానీ అరవై రోజుల్లో పరిస్థితి మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయింది. అంతా ఆయనే చేశాడంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల నేతలయితే వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. మున్సిపాలిటీలకు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను దించేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో...
ఇక ఇదిలా ఉండగా ఇటీవలే కేసీఆర్ విశ్రాంతి తర్వాత బయటకు వచ్చారు. నల్లగొండ సభలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అనేక చోట్ల పోటీకి నేతలు విముఖత చూపుతుండటం విశేషం. అభ్యర్థుల కొరత అని చెప్పలేం కానీ, గతంలో క్యూ కట్టినట్లు ఇప్పుడు కారు పార్టీ టిక్కెట్ కోసం ఎవరూ వెంపర్లాడటం లేదు. కాంగ్రెస్ గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడటానికి జంకుతున్నారు.
అభ్యర్థులున్నా...
తెలంగాణలో పదిహేడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టలేదని మాత్రం కాదు. కానీ సమర్థులైన... ఆర్థికంగా బలవంతులైన వారిని మాత్రం పోటీకి దింపలేని పరిస్థితి ఉందన్నది మాత్రం వాస్తవం. కొందరిని నచ్చచెప్పి.. ఒప్పించి బలవంతంగా బరిలోకి దింపాల్సిన పరిస్థితి నేడు బీఆర్ఎస్ లో తలెత్తిందంటే ఎన్నికల ఫలితాల మహమే. అదే కేసీఆర్. అదే మైండ్.. అవే ఆలోచనలు.. మరి ఆ వ్యూహాలు ఎక్కడికి వెళ్లాయి? ఆ స్కెచ్ లు సక్సెస్ కాకుండా ఎందుకు పోయాయంటే మాత్రం సరైన సమాధానం దొరకదు. ప్రజలు తలచుకుంటే ఏదైనా చేయగలరన్న దానికి ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి నిదర్శనంగా చెప్పుకోవాలి.
Next Story