Mon Nov 18 2024 09:27:32 GMT+0000 (Coordinated Universal Time)
BJP : చిన్నమ్మ దెబ్బకు వాళ్లంతా చిందరవందర.. అస్సలు కనిపించడమే లేదే?
దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత పాత బ్యాచ్ కనిపించడం మానేసింది.
దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టనంత వరకూ పార్టీలో ఒక సీన్ ఉండేది. కొందరిదే ఆధిపత్యం. వారి నిర్ణయాలే అంతిమం. అధినాయకత్వానికి వారు ఇచ్చే నివేదికలను బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయాలు జరిగేవి. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీతో కలసి ఎక్కడా పనిచేసిన దాఖలాలు లేవు. చివరకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక మినహా బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పవన్ అడుగుపెట్టలేదు కూడా. నాటి రాష్ట్ర నాయకత్వం వైసీపీకి అండగా ఉంటూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందన్నది బీజేపీలో కొందరి వాదన.
బాధ్యతలను చేపట్టిన తర్వాత...
అయితే పురంద్రీశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం మౌనముద్ర దాల్చింది. ఎక్కడా కనిపించడమూ లేదు. చిన్నమ్మ అంతా తానే అయి పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టారు. అధికార వైసీపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. పొత్తుల అంశాన్ని పార్టీ చూసుకుంటుందని, తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. పురంద్రీశ్వరికి పాత నాయకులు ఎవరూ సహకరించలేదన్నది కాదనలేని వాస్తవం. అయినా ఆమె దేనినీ లెక్క చేయకుండా తన పని తాను చేసుకుని వెళుతున్నారు. కేంద్ర నాయకత్వం సూచనలతో ఆమె అడుగులు వేశారు.
స్థానం ఎక్కడ?
తాజాగా అభ్యర్థుల ఎంపిక చూసినా పాత బ్యాచ్ కు పురంద్రేశ్వరి చెక్ పెట్టినట్లుగానే కనపడుతుంది. సోము వీర్రాజు కు పోటీ చేసేందుకు స్థానం లేదు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని భావించిన సోము వీర్రాజును తానే అభ్యర్థిగా పురంద్రీశ్వరి బరిలోకి దిగడంతో అవాక్కయ్యారు. అనపర్తి స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని నాయకత్వం చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడి నుంచి పోటీ చేయడానికి సోము వీర్రాజు సుముఖత చూపడం లేదు. దీంతో ఆయనకు ఎక్కడ టిక్కెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానాలకు ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది.
మూడేళ్ల నుంచి...
అదే సమయంలో జీవీఎల్ నరసింహారావు మూడేళ్ల నుంచి విశాఖలో ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జీవీఎల్ కు ఇప్పుడు పోటీ చేయడానికి ఎక్కడా స్థానమే లేదు. మొన్న ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో ఆయన ఊసే కనిపించ లేదు. ఇక పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి హిందూపురం లోక్సభ నుంచి పోటీ చేయాలనుకున్నారు. లేదంటే కదిరి అసెంబ్లీ స్థానంలో బరిలోకి దిగాలనుకున్నారు. కానీ ఆ రెండు టీడీపీ ఖాతాలోకే వెళ్లాయి. దీంతో విష్ణు కూడా ఈ ఎన్నికల్లో చేతులూపుకుంటూ తిరగాల్సిందే తప్ప పోటీ చేసే అవకాశమే లేదు. మొత్తం మీద చిన్నమ్మ పాత బ్యాచ్ కు చెక్ తన దైన రీతిలో పెట్టేశారన్న టాక్ మాత్రం పార్టీలో వినిపిస్తుంది.
Next Story