Mon Dec 23 2024 17:58:02 GMT+0000 (Coordinated Universal Time)
Magunta : మాగుంట మళ్లీ సైకిలెక్కుతారా... ఈసారి అయినా గెలుస్తారా?
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఒంగోలు పార్లమెంటు టిక్కెట్ ఇచ్చే విషయంలో వైసీపీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత వత్తిడి తెచ్చారు. అయినా అధిష్టానం మాత్రం దిగిరావడం లేదన్న సమాచారంతో మాగుంట అభిమానులు నిరాశలోకి వెళ్లిపోయారు. బాలినేని కూడా హ్యాండ్సప్ అనేశారు. తాను చేయగలిగినదంతా చేశానని, ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని బాలినేని చెప్పారంటే మాగుంటకు టిక్కెట్ డౌటే.
మంచిపేరున్నా...
మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి హయాం నుంచి ఈ నియోజకవర్గంలో వారికంటూ సొంత ఓటు బ్యాంకు కూడా ఏర్పడింది. అడిగిన వారికి లేదన్నట్లుగా.. అలాగే సేవా కార్యక్రమాల్లో ముందుండటం వంటి వాటితో మాగుంట ఫ్యామిలీకి ప్రజల్లో ఇప్పటికీ చెదరని ఆదరణ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రెడ్డి సామాజికవర్గంతో పాటు ఎస్.సి, ఎస్టీ, మైనారిటీలు కూడా మాగుంట నాయకత్వానికి అనుకూలంగానే ఉంటాయని ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. అందుకు వేరే ఉదాహరణలు చెప్పాల్సిన పనిలేదు.
మూడు దశబ్దాల నుంచి...
దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంతో అనుబంధం ఉంది. మాగుంట సుబ్బరామిరెడ్డిని మావోయిస్టులు చనిపోయిన తర్వాత ఆయన సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ వచ్చినా ఆమె ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇప్పటికి మూడు దఫాలుగా ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009,2019 ఎన్నికల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలి రెండుదఫాలు కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ నుంచి ఆయన ఎన్నిక కాగలిగారు. 2014లో ఆయన టీడీపీలో చేరి పోటీ చేసినా గెలవలేకపోయారు. అంటే ఇక్కడ టీడీపీ ఎఫెక్ట్ మాగుంట కుటుంబంపై పడిందనే భావించారు. తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దించాలని ఆయన భావించారు.
లిక్కర్ స్కామ్ ఆరోపణలతో....
కానీ ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం టిక్కెట్ ఇవ్వకపోవడానికి కూడా ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొనడమే. మాగుంట ఫ్యామిలీది తొలి నుంచి లిక్కర్ వ్యాపారమే. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జైలులో ఉండి బెయిల్ పై వచ్చారు. మాగుంటకు ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది అదీ ఒక కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ కేసులున్నంత మాత్రాన టిక్కెట్లు ఇవ్వకపోతే ఏ నేతపైన కేసులు లేవన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అయినా వైవీ సుబ్బారెడ్డి పట్టుబట్టడంతో మాగుంటకు టిక్కెట్ ను నిరాకరిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే టీడీపీలోకి వెళ్లి పోటీ చేసినా గెలుస్తారన్న నమ్మకం ఉందా? లేదా? అన్న ఆలోచనలో మాగుంట కుటుంబం ఉందని తెలిసింది. అయితే ఈసారి జనసేన పొత్తు ఉండటంతో కొంత ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. గెలిస్తే మాత్రం రెండున్నర దశాబ్దాల తర్వాత టీడీపీ ఇక్కడ విజయం సాధించినట్లే. మరి వైసీపీ టిక్కెట్ నిరాకరిస్తే.. మాగుంట టీడీపీలోకి వెళతారా? లేక మౌనంగా ఉంటారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story