Sun Dec 22 2024 21:49:19 GMT+0000 (Coordinated Universal Time)
Congress : జోడు పదవులు కుదరదట.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే?
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా కొత్త వారిని నియమించడానికి కసరత్తులను హైకమాండ్ ప్రారంభించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ పీీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికలకు జరగడానికి ముందే ఈ పదవిలో కొత్త వారిని కూర్చోబెట్టాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలంటే సామాజికవర్గాల సమీకరణ ప్రకారం కొత్త అధ్యక్షుడిని నియామకం చేపట్టాలని యోచిస్తున్నారు. అందుకోసం పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారని విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
కసరత్తు ప్రారంభం...
ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజికవర్గం నేత ఉండటంతో పీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పీసీసీ చీఫ్ పదవికి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆశావహులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీకి చీఫ్ గా ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. అందుకే అప్పుడే కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా మొదలయింది. ఢిల్లీ వెళ్లి తమకు పీసీసీ చీఫ్ పదవి కావాలని, తాము పార్టీకి లాయల్ గా ఉంటూ పార్టీ బలోపేతం కోసం కొన్నేళ్లుగా పనిచేస్తున్నందున తమకు ఒక్కసారి అవకాశమివ్వాలని నేతలు కోరుకుంటున్నారు.
భట్టి మాత్రం...
అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజికవర్గం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ అయిన మల్లు భట్టివిక్రమార్కను నియమించారు. కానీ భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. కనీసం తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కర్ణాటక తరహలో అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పేరును పీసీసీచీఫ్ పదవికి పరిశీలించాలని ఆయన గట్టిగానే కోరుతున్నారు. కానీ హైకమాండ్ ఆలోచన మాత్రం భిన్నంగా ఉందన్న సమాచారం అందుతుంది. లోక్సభ ఎన్నికల వేళ సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
బీసీలకు ఇవ్వదలచుకుంటే...
అందుకే పీసీసీ చీఫ్ పదవికి బీసీలను ఎంపిక చేస్తారన్న వాదన కూడా బలంగా వినపడుతుంది. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆకట్టుకోవాలంటే వారికే ఈ పదవి ఇవ్వడం సముచితమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే బీసీలలో పీసీసీ చీఫ్ పదవికి ఎంపిక చేస్తే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. రాహుల్ కు సన్నిహితంగా ఉండే మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ పేరు కూడా బాగానే వినిపిస్తుంది. అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుందని సమాచారం. మొత్తం మీద మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నారన్న వార్తలు హస్తినలో గుప్పుమంటున్నాయి.
Next Story