Thu Jan 09 2025 02:52:53 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లవి కుటుంబ రాజకీయాలు : విపక్షాలపై మోదీ విసుర్లు
యూపీఏ హయాంలో జరిగిన తప్పుల్ని తాము సరిదిద్దామని, ఈ తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం గణనీయమైన అభివృద్ధి ..
బెంగళూరులో రెండోరోజు విపక్ష కూటమి సమావేశం కొనసాగుతోంది. కూటమి పార్టీల ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. సొంత లాభం కోసమే విపక్షాలు పనిచేశాయని, కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పనిచేశాయని విమర్శించారు. పోర్ట్ బ్లెయిర్ లో వీరసావర్కర్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ ను మంగళవారం వర్చువల్ గా ప్రారంభించిన ఆయన.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలకు పాల్పడ్డాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.
యూపీఏ హయాంలో జరిగిన తప్పుల్ని తాము సరిదిద్దామని, ఈ తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. గత ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోలేదన్న ప్రధాని.. అభివృద్ధి అనే మాటెత్తకుండా స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది కానీ.. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించే పార్టీల్లో కుటుంబాల కోసమే, కుటుంబాల చేత, కుటుంబాల కొరకే అని ఉంటుందన్నారు. దేశం కోసం వాళ్లేం చేయరు కాబట్టే విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయన్నారు. విపక్షాలు కేవలం వాళ్లు మాత్రమే ఎదగాలనుకునే స్వార్థంతో ఉంటారని, పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చేయరన్నారు.
2024 ఎన్నికల్లో దేశ ప్రజలు మళ్లీ ఎన్డీయేకే పట్టం కడతారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అందుకే విపక్షాలు బెంగళూరు చేరి తమ దుకాణాలను తెరిచాయని వ్యంగ్యం ప్రదర్శించారు. 24కే లియే 26 హోనే వాలో రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్ తా హై అంటూ.. పాటలు పాడుతున్నారు కానీ.. వాస్తవం మరోలా ఉందన్నారు మోదీ. విపక్షాల దుకాణాల్లో కులం అనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే అధికంగా ఉంటాయని ఎద్దేవా చేశారు.
Next Story