Fri Nov 22 2024 23:31:30 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress : పాపం పొన్నాల.... అయ్యో నాగం.. ఇలా ఎందరో నేతలు
తెలంగాణ ఎన్నికల్లో కొందరి నేతల రాజకీయ జాతకాలు మారిపోయాయి.
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. అత్యంత అదృష్టవంతులు కొందరైతే.. మరికొందరు దురదృష్టవంతులు కూడా ఉన్నారు. తమకు టిక్కెట్ రాదన్న కారణంతో చివరి నిమిషంలో కండువా మార్చిన వారు ఇప్పుడు ఘొల్లుమంటున్నారు. వారిలో సీనియర్ నేతలు ఇద్దరున్నారు. వారు చివరి నిమిషంలో పార్టీ మారి తమ రాజీకీయ జీవితాన్ని మరో ఐదేళ్ల పాటు వెనక్కు నెట్టేసుకున్నారు. వాళ్లే సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్థన్ రెడ్డిలు. ఇద్దరూ తమకు టిక్కెట్ ఇవ్వలేదన్న కారణంతో అధినాయకత్వం చెబుతున్న సూచనలు పక్కన పెట్టి మరీ గులాబీ పార్టీ పంచన చేరిపోయారు.
సుదీర్ఘకాలం...
పొన్నాల లక్ష్యయ్య సుదీర్ఘంగా కాంగ్రెస్ లోనే పనిచేశారు. ఆయన మంత్రిగా కూడా కొనసాగారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో ఆయనకు తెలియంది కాదు. వరసగా రెండుసార్లు జనగామ నుంచి ఓటమి పాలు కావడంతో మూడోసారి టిక్కెట్ ఇచ్చేందుకు అధినాయకత్వం నిరాకరించింది. దీనిని సాకుగా చూపిన పొన్నాల లక్ష్మయ్య దశాబ్దాలు ఉన్న పార్టీని వీడి కారు పార్టీలోకి జంప్ చేశారు. బీసీ కార్డు ఉపయోగించినా ఫలితం లేకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన మరో ఐదేళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే.
చివరి నిమిషంలో...
ఇక మరో సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి. ఈయన తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం సొంతంగా పార్టీ పెట్టి తర్వాత బీజేపీలో చేరిపోయారు. అనంతరం కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కొంత సెటిల్ అయినట్లే కనిపించినా నాగర్ కర్నూలు టిక్కెట్ ను ఆయన ఆశించి భంగపడ్డారు. దీంతో తన తత్వానికి విరుద్ధంగా పదేళ్ల పాటు కేసీఆర్ వైపు వెళ్లకుండా ఓపిక పట్టిన నాగం జనార్ధన్ రెడ్డి ఇక ఆగలేకపోయారు. తనకు టిక్కెట్ ఇవ్వలేదన్న అక్కసు, ఆగ్రహంతో ఆయన జంప్ చేసేశారు. ఆయన పార్టీ మారిన బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి రాకపోవడంతో ఆయన కూడా రాజకీయంగా ఇబ్బంది పడక తప్పదు.
సీనియర్ అయి కూడా...
బీఆర్ఎస్ టిక్కెట్లు ప్రకటించిన తర్వాత కూడా వీళ్లంతా ఆ పార్టీలోకి వెళ్లారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందన్న నమ్మకంతో వారు పార్టీని వీడారు. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణు వర్థన్ రెడ్డి కూడా అంతే. అలాగే మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీ మారి చాలా కాలమయినప్పటికీ ఆయన బీజేపీలో చేరి ఈ ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే కొందరు అదృష్టవంతులు కూడా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు వంటి నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి టిక్కెట్ పొంది అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారారు. ఇలా కొందరి లక్ అలా ఉంటే.. మరికొందరి బ్యాడ్ లక్ ఇలా ఉంది.
Next Story