Fri Nov 22 2024 21:05:23 GMT+0000 (Coordinated Universal Time)
పొలిటికల్ ఐపీఎల్..! ఒకే వేదికపైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు
మన దగ్గర నేతల మధ్య బహిరంగ చర్చలు జరగవు. కానీ, ఇప్పుడు తెలంగాణ నేతలు అమెరికాలో బహిరంగ చర్చకు దిగబోతున్నారు.
హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు అభ్యర్థుల డిబేట్లు జరుగతాయి. పోటీలో ఉండే అభ్యర్థులు ఒకే వేదికపైకి వచ్చిన వివిధ అంశాలపైన వారి వాదనలు వినిపిస్తుంటారు. గెలిస్తే వారు ఏం చేస్తారో చెబుతారు. కీలక అంశాలపైన వారి వైఖరి ఎలా ఉంటుందో వెల్లడిస్తారు. ప్రజలు ఎవరి వాదనతో అంగీకరిస్తారో, ఎవరి మాటలకు ఆకర్షితులవుతారో వారినే గెలిపిస్తారు. గెలుపోటముల్లో ఈ డిబేట్లు చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి.
ఇప్పుడు అమెరికాలోనే ఒక కీలక రాజకీయ డిబేట్ జరగబోతోంది. అయితే, ఈ డిబేట్ అమెరికా రాజకీయాలపైన కాదు. తెలంగాణ రాజకీయాల పైన. సాధారణంగా వివిధ అంశాలు తెరపైకి వచ్చినప్పుడు లేదా ఎవైనా ఆరోపణలు వచ్చినప్పుడు బహిరంగ చర్చకు సిద్ధమా అని నేతలు మన దగ్గర సవాళ్లు విసురుతుంటారు. తేదీ, సమయం, సెంటర్ ఫిక్స్ చేసుకొని తొడలు కొడతారు. అయితే, ఇవి సవాళ్లకే పరిమితం అవుతాయి. బహిరంగ చర్చ సమయానికి ఇరు పక్షాలు అనుచరులను పోగేస్తాయి. దీంతో శాంతిభద్రత సమస్య వస్తుందనే కారణంతో పోలీసులు ఇరు వర్గాలను అరెస్టు చేసి పుల్‌స్టాప్ పెట్టేస్తారు.
కాబట్టి, మన దగ్గర నేతల మధ్య బహిరంగ చర్చలు జరగవు. కానీ, ఇప్పుడు తెలంగాణ నేతలు అమెరికాలో బహిరంగ చర్చకు దిగబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఈ డిబేట్లో పాల్గొనబోతున్నారు. అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఈ డిబేట్‌ను నిర్వహిస్తోంది. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో గల న్యూ జెర్సీ కన్వెన్షన్ ఆండ్ ఎక్స్పోసిషన్ సెంటర్లో మే 28వ తేదీన ఈ ఆల్ పార్టీ పొలిటికల్ డిబేట్ జరగబోతోంది.
టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ డిబేట్లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి పాల్గొననున్నారు. బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి డీకే అరుణ హాజరవుతారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు, ఇతర కీలక అంశాలపైన ఈ డిబేట్లో చర్చ జరగబోతోంది. ఇది కచ్చితంగా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
Next Story