Mon Dec 23 2024 01:55:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పార్టీ మారినోళ్ల పరిస్థితిని మీరూ చూస్తారా..? ఏమైపోయారో? చూడండి మరి
పార్టీ మారినోళ్ల రాజకీయ భవిష్యత్ అంత ఆశాజనకంగా లేదు. గతంలో పార్టీ మారిన నేతలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు
పార్టీలు మార్చడం ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. తమను గెలిపించిన ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా అనేక మంది అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. ఐదేళ్లలో పెత్తనం కోసం.. లేకుంటే సంపాదన కోసం... రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టుకుంటున్నారు. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో ఇతే తంతు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి అప్పట్లో అధికార బీఆర్ఎస్ లో చేరిన వాళ్లను మళ్లీ ప్రజలు వారి ఫేస్ లను కూడా చూసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో అనేక మంది ఐదేళ్ల పాటు మాజీలుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. గతంలో పార్టీ మారిన వాళ్ల అడ్రస్ గల్లంతయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థిితి. ఎవరో ఇద్దరో, ముగ్గురో తప్ప అత్యధిక శాతం మంది జెండా మార్చిన వాళ్లను మాత్రం జనం పీకి పక్కన పెట్టేశారు.
23 మందిలో...
ఆంధ్రప్రదేశ్ లోనూ అంతే. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పైగా మెజారిటీకి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కేవలం అధికారం కోసం అప్పట్లో చంద్రబాబు పాలన చాలా బాగుందని పొగుడుతూ దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అప్పటి ప్రతిపక్ష వైసీపీ నుంచి జంప్ అయ్యారు. వీరిలో నలుగురు మంత్రులుగా కూడా నాడు నియమితులయ్యారు. అయితే ఆ తర్వాత మాత్రం వారిలో చాలా మంది ఫేడ్ అవుట్ అయ్యారు. పార్టీ మారిన వారిలో 2019 ఎన్నికల్లో చాలా మందికి సీటు దక్కకపోగా, దక్కిన వారిలో ఒకే ఒక్కరు మళ్లీ గెలిచారు. ఆయనే అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. ఆయన తప్పించి 23 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ మళ్లీ గెలవలేదు.
టిక్కెట్లు దక్కేనా?
అందులో ఇద్దరు మరణించారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించగా, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వారి వారసులు కూడా గెలవలేదు. అంటే పార్టీ మారిన వాళ్లను జనం ఆదరించరన్న విషయం బాగా అర్థమయింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలయి ఐదేళ్ల పాటు రాజకీయంగా దూరంగా ఉన్నవారు కొందరైతే అసలు సీటు దక్కని వారు కూడా అనేక మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి వీరిలో ఎక్కువ మందికి సీటు దక్కే అవకాశాలు కూడా లేవు. అంటే పార్టీ మారి తమ రాజకీయ గొయ్యిని తామే తవ్వుకున్నట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నియోజకవర్గాలలో కుటుంబ నేపథ్యం కలిగి, కొద్దో గొప్పో ఆర్థికంగా బలం కలిగిన నేతలు మాత్రం కొంత నిలదొక్కుకుంటున్నారు.
వీళ్లు అంతే...
ఇక 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీకి గత ఎన్నికల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో నలుగురు పార్టీలు మారారు. వీరిలో ఒకరికి ఇప్పటికే టిక్కెట్ ను వైసీపీ అధినాయకత్వం టిక్కెట్ ను నిరాకరించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి, చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్, గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీలు వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు. అయితే వీరిలో మద్దాలి గిరికి టిక్కెట్ నో చెప్పింది. మిగిలిన ముగ్గురిలో టిక్కెట్ ఇచ్చినా ఎంత మంది గెలుస్తారన్నది సందేహంగానే కనపడుతుంది. అందుకే పార్టీ మారిన నేతలకు ఇది ఒక హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి జంప్ జిలానీలు జర జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
2014లో వైసీపీ నుంచి టీడీపీలోకి...
01, సుజయకృష్ణ రంగారావు - బొబ్బిలి
02. అఖిలప్రియ - ఆళ్లగడ్డ
03. అమర్నాధ్ రెడ్డి - పలమనేరు
04. ఆదినారాయణ రెడ్డి - జమ్మలమడుగు
05. జ్యోతుల నెహ్రూ - జగ్గంపేట
06. వరుపుల సుబ్బారావు - ప్రత్తిపాడు
07. వంతల రాజేశ్వరి - రంపచోడవరం
08. గిడ్డి ఈశ్వరి - పాడేరు
09. జలీల్ ఖాన్ - విజయవాడ పశ్చిమ
10. ఉప్పులేటి కల్పన - పామర్రు
11. పాశం సునీల్ కుమార్ - గూడూరు
12. పోతుల రామారావు - కందుకూరు
13. పాలపర్తి డేవిడ్ రాజు - యర్రగొండపాలెం
14. అశోక్ రెడ్డి - గిద్దలూరు
15. గొట్టిపాటి రవికుమార్ - అద్దంకి
16. కలమట వెంకటరమణ - పాతపట్నం
17. చాంద్ భాషా - కదిరి
18. కోడుమూరు - మణిగాంధీ
19. బుడ్డా రాజశేఖర్ రెడ్డి - శ్రీశైలం
20. ఎస్వీ మోహన్ రెడ్డి - కర్నూలు
21. జయరాములు - బద్వేలు
22. భూమా నాగిరెడ్డి - నంద్యాల
23. కిడారి సర్వేశ్వరరావు - అరకు
2019 నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి
01. కరణం బలరాం - చీరాల
02. వల్లభనేని వంశీ - గన్నవరం
03. మద్దాలి గిరి - గుంటూరు తూర్పు
04 - వాసుపల్లి గణేష్ - విశాఖ పశ్చిమ
Next Story