Mon Jan 13 2025 02:49:19 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : ఈయన చొక్కా మడత బెడతానంటున్నాడు.. ఆయన కుర్చీ మడతబెడతానంటున్నాడుగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. సినిమా నటులు కాకపోయినా డైలాగులతో చంద్రబాబు, జగన్ అదరగొట్టేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. సినిమా నటులు కాకపోయినా సినీ డైలాగులతో అధికార, విపక్ష అగ్రనేతలు అదరగొట్టేస్తున్నారు. ఒకరకంగా అసలైన హీరో.. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ డైలాగ్ వార్ లో వెనకబడి పోయినట్లే కనపడుతున్నారు. ఏడు పదుల వయసులో చంద్రబాబు, ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌లలో ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరూ జనాలను ఆకట్టుకునేందుక ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో పవన్ కల్యాణ్ మాత్రం కాస్త నెమ్మదిగానే కనపడుతున్నారు. ఆయన ఇంతవరకూ ప్రచారాన్ని కూడా ప్రారంభించలేదు. ఇంకా రధానికి టెంకాయ కొట్టే పనిలోనే ఉన్నారు.
హీటెక్కిన ఏపీ....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న ఫిరంగిపురంలో జరిగన సభలో చేతులు మడతపెట్టాల్సి వస్తుందని ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. దానికి కౌంటర్ గా చంద్రబాబు అదే రోజు రాత్రి విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అలాగయితే జనం సీఎం కుర్చీని మడతపెడతారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విడుదలయిన గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్ ను వీరు డైలాగులుగా మార్చి పార్టీ కార్యకర్తలను, ప్రజలు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పుడే చంద్రబాబు, జగన్ డైలాగులతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
చంద్రముఖి.. పాయిజన్ ...
అదొక్కటే కాదు.. జగన్ ప్రజలు ఈసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కకుంటే పడుకున్న చంద్రముఖి ఐదేళ్ల తర్వాత నిద్రలేస్తుందని అని అంటూ చంద్రముఖి డైలాగ్ తో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తాను అభిమన్యుడిని కానని, అర్జునడినంటూ సిద్ధం సభల్లో జగన్ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా చంద్రబాబు కూడా ధీటుగా డైలాగులు కొడుతున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండ సినిమాలో డైలాగు కొట్టి చంద్రబాబు కూడా జగన్ కు తాను ఏమాత్రం తగ్గేది లేదంటూ జవాబిచ్చారు. తాను విజన్ ఉన్న నేతనని, జగన పాయిజన్ ఉన్న లీడర్ అంటూ మరొక డైలాగ్ ను క్యాడర్ లో చంద్రబాబు పాపులర్ చేశారు.
ఈయన మాత్రం...
అయితే వీరిద్దరూ ఇలా సాగుతుంటే మధ్యలో పవన్ కల్యాణ్ మాత్రం సినిమా చూసినట్లు చూస్తుండి పోతున్నారు. ఆయన ఇంత వరకూ ప్రచారానికి దిగలేదు. వారాహి యాత్ర అంటూ ప్రారంభించి కొన్ని నెలల ముందు ఆపేసిన పవన్ కల్యాణ్ మళ్లీ మొదలు పెట్టలేదు. మంగళగిరి, హైదరాబాద్ లు తిరుగుతూ అంతా చంద్రబాబు, మోడీ చూసుకుంటారులేనన్న ధోరణిలో ఉన్నట్లు కనపడుతుంది. మొత్తం మీద సినిమా రంగానికి సంబంధం లేని జగన్, చంద్రబాబులు సినీ డైలాగులతో దూసుకు వెళుతుంటే... అదే రంగం నుంచి వచ్చిన పవన్ మాత్రం ఇంకా వార్ మొదలు కాలేదన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి పవన్ కూడా సినీ డైలాగులతో అదరగొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.
Next Story