Mon Dec 23 2024 10:02:16 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగనే చంద్రబాబుకు అప్పగించనున్నారా? మరోసారి పై చేయి సైకిల్ పార్టీదేనా?
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారవుతున్న వేళ రాజ్యసభ ఎన్నికలు వైసీపీకి ఇబ్బందికరంగా మారనున్నాయి
రాజకీయాల్లో ఎప్పుడూ అంకెలే పైచేయి సాధిస్తాయి. అది ఓట్ల రూపంలో కావచ్చు. మరేదైనా సరే. అంకెలతోనే అధికారం కానీ, పదవులు కాని వస్తాయి. అందులో ఎలాంటి సందేహమూ ఎవరికీ అవసరం లేదు. పాలిటిక్స్ లో అంకెకు ఉన్న లంకె అంతా ఇంతా కాదు. ఇది కాస్తో.. కూస్తో రాజకీయం తెలిసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది. కానీ అన్నీ తెలిసిన వైఎస్ జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే మిగిలిన రాజకీయ నేతలు వేరు. జగన్ వేరు. జగన్ అంకెలను నమ్మరు. పంఖానే నమ్ముకుంటారు. అంటే ఫ్యాన్ గుర్తు ఉంటే చాలు అధికారం తనదేనని, పదవులు మనకేనన్న ధీమా ఆయనలో ప్రతి నిమిషమూ కనిపిస్తుంది.
అన్ని తెలిసినా...
ఏ రాజకీయ నేత అయినా ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జగన్ మాత్రం నిర్ణయాలు మనకు మొండిగానే కనిపిస్తాయి. భవిష్యత్ లో ఇలా జరుగుతుందని తెలిసీ భయపడరు. మనస్తత్వం అదే కాదు. అందుకే ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునే విషయంలోనూ జగన్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మరొక నేత అయితే రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ అభ్యర్థులను ఖరారు చేయరు. ఆ ధైర్యంకూడా చేయరు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది కాబట్టి వారిని దూరం చేసుకుంటే రాజ్యసభ పదవి పోతుందన్న ఆందోళన అందరికీ ఉంటుంది. కానీ జగన్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇవేమీ పట్టించుకోవడం లేదు.
మూడు ఖాళీలు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీలవుతున్నాయి. సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం పూర్తవుతుంది. ఇందులో రెండు స్థానాలు ఇతర పార్టీలకు చెందినవి. సీఎం రమేష్ టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికై బీజేపీలో చేరారు. కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఈ రెండు స్థానాలతో పాటు మరొకసారి మూడు స్థానాలను తాను సాధించుకునేంత బలం శాసనసభలో జగన్ కు ఉంది. 151 సభ్యులు బలం ఉన్న వైసీపికి మూడు స్థానాలను కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈజీ టాస్క్. అయితే మామూలుగా ఉంటే. కానీ జగన్ గత కొద్ది రోజులుగా పార్టీ ఇన్ఛార్జులను మార్చేస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలను జగన్ విడుదల చేశారు. తొలి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు.
క్రాస్ ఓటింగ్ జరగదా?
అందులో చాలా మంది సహజంగానే అసంతృప్తిగా ఉంటారు. కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు అయితే ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వైసీపీకి దెబ్బతగిలింది. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో ఒక్క ఎమ్మెల్సీ సీటును వైసీపీ చేజార్చుకోవాల్సి వచ్చింది. పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో నలుగురి పై సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానం దక్కాలంటే 44 ఓట్లు అవసరం. ఆ సంఖ్యాబలం లేకపోయినా జగన్ పై అసంతృప్తి, అసహనంతో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశముందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే టీడీపీ కూడా ఒక్క స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో మరోసారి ఏపీలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయం అధికార పార్టీలో ఉంది. అయినా సరే జగన్ మాత్రం తన జాబితాను విడుదల చేస్తూనే ఉన్నారు. తగ్గడం లేదు. తన వారిపై ఆయనకున్న నమ్మకం కావచ్చు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story