Mon Dec 23 2024 05:22:21 GMT+0000 (Coordinated Universal Time)
కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసిన రేవంత్ రెడ్డి
ఐదు లక్షల మంది సభకు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు. అయితే, ఎంత మంది వచ్చారని కొలిచే..
హన్మకొండ : వరంగల్ నగర నడిబొడ్డున తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. ఈ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐదు లక్షల మంది సభకు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు. అయితే, ఎంత మంది వచ్చారని కొలిచే కొలతలేమీ లేవు కానీ పల్లె పల్లె నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఈ సభకు తరలివచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాహుల్ గాంధీతో నిర్వహించిన ఈ మొదటి సభ విజయవంతం కావడం ఆయనకు రాజకీయంగా, పార్టీలో పట్టు సంపాదించడానికి చాలా కలిసి రానుంది.
అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సభ నిర్వహణకు వరంగల్‌ను ఎంచుకోవడం కూడా రాజకీయంగా రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. నిజానికి, రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడమే అరుదు. ఆయన వచ్చేదే ఏడాది, రెండేళ్లకు ఒకసారి. ఇలా వచ్చినప్పుడు ఆయన పర్యటనను పార్టీకి రాజకీయంగా ఉపయోగపడేలా చూసుకోవాలి. అది పీసీసీ చీఫ్ బాధ్యత. సరైన ప్రాంతంలో ఆయన పర్యటించేలా ప్రణాళిక వేసుకోవాలి. గతంలో రాహుల్ గాంధీ పర్యటనల స్థల ఖరారు విషయంలో రాజకీయం ప్రయోజనాల కంటే కూడా డబ్బుల లెక్కలే ప్రభావం చూపేవి.
ఏ నేత అయితే రాహుల్ గాంధీ సభ నిర్వహణకు అయ్యే భారీ ఖర్చును భరించగలడో.. అదే నేత నియోజకవర్గంలో రాహుల్ సభలు జరిగేవి. ఇతర రాజకీయ అంశాలు అంతగా పట్టించుకునే వారు కాదు. కానీ, వరంగల్ సభ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేలా వరంగల్‌ను ఎంపిక చేశారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేస్తోంది. వరంగల్‌లో కూడా ఇప్పుడిప్పుడే బలపడే ప్రయత్నం చేస్తోంది.
కానీ, ఇప్పటికీ వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే రాజకీయం నడుస్తోంది. బీజేపీ ప్రభావం ఇంకా జిల్లాలో అంతగా మొదలు కాలేదు. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు, క్యాడర్ ఉంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి వరంగల్‌లో కాంగ్రెస్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే, జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండటం వల్ల అంతగా ప్రభావం చూపలేకపోతోంది కానీ రెండో స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీనే నిలుస్తోంది. కాబట్టి, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ పెరిగితే కచ్చితంగా మంచి స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కావున, ఎన్నికల నాటికి కూడా టీఆర్ఎస్కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థిగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కచ్చితంగా కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది. ఇలా జరగాలంటే జిల్లాలో బీజేపీని నిలువరించాలి. ఈ దిశగా రాహుల్ గాంధీ సభ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సభ సక్సెస్ కావడం వల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే భావన ప్రజలకు కలుగుతుంది. వరంగల్ నగరంలో సభ నిర్వహించడం వల్ల నగరంలోని రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు చుట్టుపక్కల స్థానాలపై కూడా ప్రభావం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఓరుగల్లు జిల్లాలో బీజేపీ ఎదగకుండా అడ్డుకోవడంలో, జిల్లాలో కాంగ్రెస్ ఇమేజ్ పెంచడంలో రాహుల్ సభ ద్వారా రేవంత్ సక్సెస్ అయ్యారు.
Next Story