Sun Dec 22 2024 02:23:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కెలుక్కుని మరీ..? ఎన్నికలకు ముందే మొదలయిన వార్
అధికారంలో ఉన్న వైసీపీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలన్న అత్యుత్సాహం ఆ పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
అధికారంలో ఉన్న వైసీపీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలన్న అత్యుత్సాహం ఆ పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అనేక నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేపట్టడం కూడా సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుండటంతో ఎమ్మెల్యేల అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. తమ నేతకు అన్యాయం చేయవద్దంటూ వారు అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ విధమైన ఆందోళనలు మొదలయ్యాయి. అనేక నియోజవకర్గాలలో పార్టీ కార్యకర్తలు పార్టీ అధినాయకత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరికలు చేస్తున్నాయి.
రోడ్డు మీదకు వచ్చి...
పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణను అనంతపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని అధిష్టానం చెప్పిందని ఆరోపిస్తూ ఆయన అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. అలాగే కదిరి నియోజకవర్గంలో మరోసారి సిద్ధారెడ్డికే వైసీపీ టిక్కెట్ ఇవ్వాలని, ఆయనకు కాకుండా మరొకరికి టిక్కెట్ ఇస్తే అంగీకరించబోమని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ నేతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఏకపక్షంగా సర్వేల పేరు చెప్పి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని కూడా హెచ్చరికలు ఫ్యాన్ పార్టీలో వినపడుతున్నాయి.
గురజాల వైసీపీలో...
మరోవైపు పల్నాడు జిల్లా వైసీలోనూ విభేదాలు భగ్గుమన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మరోసారి టిక్కెట్ ఇవ్వవద్దంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనుచరులు బీభత్సం చేశారు. గురజాత నియోజకవర్గంలోని దాచేపల్లిలో జంగా కృష్ణమూర్తి వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాను రెండుసార్లు గురజాలకు ఎమ్మెల్యేగా చేశానని, ఈసారి టిక్కెట్ తనకే కేటాయించాలంటూ జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకత్వం వెంటనే పిలవడంతో ఆయన ఆత్మీయ సమావేశం నుంచి హుటాహుటిన బయలుదేరి తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిపోయారు. కార్యకర్తలు మాత్రం రెండుగా చీలిపోయి పరస్పరం సీటు తమ నేతకే ఇవ్వాలంటూ నినాదాలు చేసుకోవడంతో ఆత్మీయ సమావేశంలో ఉద్రిక్తత తలెత్తింది.
నరసరావుపేటలోనూ...
ఇక నరసరావుపేటలోనూ అదే పరిస్థితి. వైసీపీ నేతల మధ్య సీటు పంచాయతీ జరుగుతుంది. వైసీపీ కార్యాలయంలో బాహాబాహీకి దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇవ్వవద్దంటూ మరొక వర్గం బయలుదేరింది. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి తనకే టిక్కెట్ కావాలంటూ కోరుతున్నారు. నరసరావుపేట టిక్కెట్ ఈసారి గోపిరెడ్డికి ఇస్తే ఓటమి పాలు కావడం ఖాయమని ఆయన చెబుతున్నారు. తనకు మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ గోపిరెడ్డిపై బ్రహ్మారెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు. టిక్కెట్లు భారీగా మారుస్తున్నారన్న సంకేతాలు రావడంతో అనేక నియోజకవర్గాల్లో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా ప్రదర్శనలు చేస్తూ పార్టీని వీధినపడేస్తున్నారు.
Next Story