Mon Dec 23 2024 19:44:34 GMT+0000 (Coordinated Universal Time)
Dadi Veerabhadra Rao : ఏంది బాబాయ్ మళ్లీ పార్టీ మారుతున్నారా.. టిక్కెట్ ఇస్తారా ఈసారైనా?
సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు
వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. రేపు దాడి వీరభద్రరావు చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే దాడి వీరభద్రరావు ఎన్నికలు వచ్చే సమయానికి పార్టీలు మారడం దాడికి అలవాటే. వెన్నతో పెట్టిన విద్యే. ఆయన పార్టీ మారడం పెద్దగా ఆశ్చర్యం కలగకపోయినా ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఒక కీలక నేత పార్టీకి దూరం అవ్వడం, అందులోనూ ఉత్తరాంధ్రలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పార్టీకి నష్టమేనంటున్నారు విశ్లేషకులు.
సుదీర్ఘకాలం టీడీపీలోనే...
దాడి వీరభద్రరావు సీనియర్ నేత, సుదీర్ఘకాలం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత ఆయన వరసగా పార్టీలు మారుతూ వస్తున్నా ఆయన మాత్రం పెద్దగా రాజకీయంగా ఎదగలేకపోయారు. ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత దాడి ఫ్యామిలీని రెండు పార్టీలూ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అనకాపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాడి వీరభద్రరావు తర్వాత 1989, 1999లో విజయం సాధించారు. 1994లో ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన దాడి వీరభద్రరావు రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా...
2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వదిలేసి వైసీపీలో చేరారు. అయితే నాడు వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో 2014 ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో ఆయన ఆశించిన పదవులు లభించలేదు. దీంతో 2019 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అయితే దాడి వీరభద్రరావు కోరుకున్నట్లు వైసీపీ 2019 ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడికి విశాఖపట్నం దక్షిణం సీటు కట్టబెట్టింది. అక్కడ ఓటమి పాలు కావడంతో ఐదేళ్ల నుంచి దాడి వీరభద్రరావు కుటుంబం ఫ్యాన్ పార్టీలో అసహనంగానే గడుపుతూ వస్తుంది.
పార్టీ మారితే...?
అయితే అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ గెలవడం, ఆయనను మంత్రిగా చేయడంతో దాడి వీరభద్రరావులో మరింత ఆగ్రహం చోటు చేసుకుంది. ఆయన ఒకానొకదశలో జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా సమావేశమయ్యారు. అయితే అందరూ అనుకున్నట్లు ఆయన జనసేనలో చేరడం లేదు. టీడీపీలో చేరుతున్నారు. అయితే అక్కడ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. జనసేన కూడా పొత్తులో భాగంగా ఈ టిక్కెట్ ను ఆశించే అవకాశముంది. మరి దాడి వీరభద్రరావు ఎందుకు పార్టీ మారుతున్నారోనన్న చర్చ ఆయన అభిమానుల్లో సాగుతుంది. దాడి వీరభద్రరావు రాజీనామా ఆశ్చర్యం కలిగించకపోయినా ఆయన చేరికపైనే అనుచరులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత దక్కుతుందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
Next Story