Mon Dec 23 2024 11:39:06 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా గాంధీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పలేదు : కాంగ్రెస్
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తోందని.. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని..
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. సోనియాగాంధీ కాంగ్రెస్ ప్లీనరీలో మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజు ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తోందని.. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని ఆమె అన్నారు.
సోనియా గాంధీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను వండి వార్చాయి. అయితే వీటిలో నిజం లేదని అంటున్నారు. చత్తీస్ గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుమారి సెల్జా మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని మాత్రమే సోనియా గాంధీ చెప్పారని.. అంతేతప్ప, రాజకీయాలకు దూరమవుతున్నట్టు ఆమె ఎక్కడా చెప్పలేదని వివరించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఉద్దేశం సోనియాకు లేదని తెలిపారు.
Next Story