Sun Nov 17 2024 14:33:17 GMT+0000 (Coordinated Universal Time)
Mangalagiri : అందుకే ఆళ్ల రాజీనామా... గాజువాక కూడా అదే దారిలోనట
వైసీపీలో వరస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ గాజువాక ఇన్ఛార్జి పదవికి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు.
వైసీపీలో వరస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ గాజువాక ఇన్ఛార్జి పదవికి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మంత్రి అమర్ నాధ్ ను నియమించనున్నారని తెలిసింది. రానున్న ఎన్నికలకు జగన్ సిద్ధమవుతూ వచ్చే ఎన్నికల్లో స్థానాలను మార్చడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమైన స్థానాలను గుర్తించి అందులో సరైన నేతను బరిలోకి దింపేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినాయకత్వం సూచనలతో రాజీనామాలు చేస్తున్నారా? లేక అసంతృప్తితో రాజీనామాలుకు నేతలు దిగుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. జగన్ నిర్ణయం మేరకే వరస రాజీనామాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజికవర్గం నేతలే రాజీనామా చేయడం కూడా ఈ ప్రచారాన్ని బలపర్చే విధంగా ఉందంటున్నారు.
ఆళ్ల రాజీనామా తెలిసిందే....
ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఈ విషయం స్పష్టమయింది. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ కు పోటీగా గంజి చిరంజీవిని బరిలోకి దించాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గం ఎక్కువగా ఉండటం, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంజి చిరంజీవి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో జగన్ ఆయనను పోటీకి దించాలని నిర్ణయించారు. కేవలం పథ్నాలుగు ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు. లోకేష్ ను ఢీకొట్టడానికి ఈసారి ఆళ్ల కంటే గంజి చిరంజీవి బెటర్ అని భావించడం, సర్వేల్లోనూ అదే విషయం స్పష్టం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
లోకేష్ ను మరోసారి...
మరోవైపు గంజి చిరంజీవిని ముందుగానే పార్టీలోకి తీసుకుని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా చేసింది. వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిని చేసింది. అదే సామాజికవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పుడే టార్గెట్ మంగళగిరి అని అందరికీ అర్థమయింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవికి అవకావం ఇవ్వాలన్న నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందంటున్నారు. ఆళ్ల రాజీనామా చేసిన తర్వాత కూడా మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవిలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వారితో నేరుగా జగన్ సమావేశం కానున్నారు.
పవన్ పై పోటీకి...
మరోవైపు మంగళగిరి రాజధాని అమరావతికి దగ్గరగా ఉంది. అక్కడ వైసీపీ జెండా మళ్లీ ఎగరాలన్న యోచనలో జగన్ ఉన్నారు. అందుకే మంగళగిరిపై ప్రత్యేకంగా అనేక రకాలుగా సర్వేలు చేయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ ను మరోసారి ఓడించి సత్తా చాటాలన్న ఉద్దేశ్యంతో ఈ డెసిషన్ కు దిగారు. అలాగే పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. తిప్పల నాగిరెడ్డి స్థానంలో అక్కడ మంత్రి అమరనాధ్ కు ఈసారి టిక్కెట్ ఇవ్వాలన్న యోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది. అందుకే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ పవన్, లోకేష్ ల స్థానాల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టినట్లయింది.
Next Story