Fri Nov 22 2024 20:19:28 GMT+0000 (Coordinated Universal Time)
ప్రశాంత్ కిషోర్ మనసు మార్చుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతోంది ఇదే..!
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా..
ఇటీవల కాలంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే చర్చ జరిగింది. అందుకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో కీలక చర్చలు కూడా జరిగాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ధ్రువీకరించారు. 2024 ఎన్నికల సన్నద్ధత కోసం కాంగ్రెస్ పార్టీకి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఉండేందుకు పీకే అంగీకరించలేదు. సోనియా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా నిరాకరించినట్టు సూర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్‌లో తాను చేరడం లేదని పీకే కూడా ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న సోనియా గాంధీ ఆహ్వానాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించడంపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత వి.హనుమంతరావు స్పందించారు. ఇటీవల ప్రగతి భవన్ కు వెళ్లాక ప్రశాంత్ కిశోర్ మనసు మార్చుకున్నారని వీహెచ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకూడదన్న ప్రశాంత్ కిశోర్ నిర్ణయం వెనుక కారణాలేంటో తెలియవని అన్నారు. పార్టీలో పీకే చేరిక అంశాన్ని కొందరు వ్యతిరేకించారని తెలిపారు.
పీకే వ్యవహారంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ "ప్రశాంత్ కిశోర్ ప్రకటనలో మా పార్టీ కార్యకర్తలకు స్పష్టత వచ్చింది. పీకే కాంగ్రెస్‌లో చేరాలా? వద్దా? అన్నది ఆయన వ్యక్తిగత విషయం. పీకే మా పార్టీలో చేరకపోతే మరీ మంచిది. పార్టీలో చేరితే మాత్రం పార్టీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలని చెప్పాం. వ్యక్తిగతంగా పీకేతో నాకు ఎలాంటి గట్టు పంచాయితీ లేదు. కేసీఆర్‌తో ఎవరు జట్టు కట్టినా వ్యతిరేకిస్తాం" అని రేవంత్ రెడ్డి స్పందించారు.
Next Story