Thu Jan 16 2025 11:07:36 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : షెడ్యూల్ విడుదలకు ముందే మోత మోగుతున్న ఆంధ్రప్రదేశ్ పల్లెలు
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమయ్యాయి
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమయ్యాయి. షెడ్యూల్ విడుడలయిన తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుండటంతో ముందుగానే ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రా కదలిరా పేరుతో పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక సభను ఏర్పాటు చేసుకుంటూ వెళుతున్నారు. అంటే 26 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు సాగనున్నాయి. ఇప్పటికే కొన్ని బహిరంగ సభల్లో ప్రసంగించారు. రోజుకు రెండు సభలు చొప్పున చంద్రబాబు పబ్లిక్ మీటింగ్ లకు హాజరవుతున్నారు.
రా కదలిరా అంటూ...
చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుని గత పదిరోజుల నుంచి ఆయన జనంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సభలకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల నుంచి క్యాడర్ ను తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం వస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెలకొంది. పార్టీ క్యాడర్ లోనూ జోష్ పెరిగింది. అయితే ఆయన ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకుండా, పొత్తులు ఖరారయినా సీట్ల పంపిణీ కాకముందే చంద్రబాబు ప్రచారంలో జోరు పెంచారు. జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. గత ఐదేళ్లలో జరిగిన వైఫల్యాలను ఆయన ప్రజల ముందు పెడుతున్నారు.
వైసీపీ శంఖారావం...
మరోవైపు ఈరోజు నుంచి వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సమరం మొదలయినట్లేనని ప్రకటించారు. యుద్ధానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. భీమిలీలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల నుంచి క్యాడర్ ను భీమిలీకి తరలించారు. అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులకు జగన్ వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో నిర్దేశించారు. ప్రతి కార్యకర్త ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారాలన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి కార్యకర్త ఈ 70 రోజుల పాటు ఒక సైనికుడిగా వ్యవహరించాలని ఆయన పిలుపు నిచ్చారు. జగన్ కూడా వరసగా నాలుగు ప్రాంతాల్లో నాలుగు భారీ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి పదో తేదీ వరకూ ఆయన సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి.
కోడ్ అమలులోకి రాకముందే...
దీనికంతటికీ కారణం షెడ్యూల్ వచ్చే నెల 10వ తేదీన వచ్చే అవకాశముందని వెల్లడి కావడమే. ఒక్కసారి షెడ్యూల్ వచ్చిందంటే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లే. హెలికాప్టర్ల ఖర్చు, భారీ బహిరంగ సభల వ్యయం మొత్తం ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల మీద పడిపోతాయి. అందుకే ముందుగానే షెడ్యూల్ రావడానికి ముందే భారీ బహిరంగ సభలతో ప్రజలతో పాటు క్యాడర్ ను కూడా సమాయత్తం చేసేలా వీరి పర్యటనలు సాగనున్నాయి. ఎన్నికల వ్యయంతో కోడ్ అమలులోకి వస్తే అనేక ఆంక్షలు, నిబంధలను అమలులోకి వస్తాయని అంచనా వేసిన టీడీపీ, వైసీపీ నేతలు ముందుగానే తమ పర్యటనలను షురూ చేసుకున్నారు. దీంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం మాత్రం వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార, ప్రతిపక్ష నేతలు సుడిగాలి పర్యటనలు మొదలు పెట్టారు.
Next Story