వైసీపీ నేతలను ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు: చంద్రబాబు
వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నారు. ఎక్స్పైరీ డేట్ అయ్యాక ఏ మందు వాడాలో కూడా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. "వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా.. మీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. మీరు తిడతారని నాకు తెలుసు.. మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు. మీకు ఎక్స్ పైరీ డేటు దగ్గర పడింది. అందుకేనేమో.. ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరి పడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లా.. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది'' అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేసులు పెడితే భయపడతారనుకుంటే, రౌడీయిజం చేస్తే భయపడతారనుకుంటే.. అది మీ (వైసీపీ నేతలు) పొరపాటేనన్నారు. ఓట్లను తారుమారు చేయొచ్చని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదని చంద్రబాబు అన్నారు. దొంగ ఓట్లను చేర్చే వారికి చెబుతున్నా, ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని, అన్నీ కంట్రోల్ చేస్తామన్నారు. తాను చెప్పే ప్రతీ మాటను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి పంటలు మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలోనే ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయన్ని వెంటిలేటర్‌పైకి తీసుకొచ్చిందన్నారు. వనరులపై దోపిడీ.. అడిగిన ప్రతిపక్షాలపై దాడులే జగన్‌కు తెలుసునని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే ఆ భూములు విలువ పెరుగుతుందన్నారు. దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్ సీఎం అయ్యాడని, రైతు నాశనమయ్యాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనకు కావాల్సింది ప్రజల నుంచి సహకారమని, ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. ప్రజలో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారి భవిష్యత్తు కోసం పని చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగుజాతిని వరల్డ్ మ్యాప్‌లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు.