Thu Jan 16 2025 04:50:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అడిగినవన్నీ ఇచ్చేయడానికి ఇవేమైనా పప్పు బెల్లాలా? సీట్లయ్యా.. సీట్లు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన అంతా రెడీ చేసుకునే జాబితాతో ఢిల్లీ చేరుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన అంతా రెడీ చేసుకునే జాబితాతో ఢిల్లీ చేరుకున్నారని తెలిసింది. అమిత్ షాతో భేటీ తర్వాత సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. అయితే బీజేపీకి ఎన్ని పార్లమెంటు, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న దానిపై ముందునుంచే చంద్రబాబు కసరత్తులు చేశారట. అందుకే ఆయన పిలిచిన వెంటనే బయలుదేరి వెళ్లారు. అమిత్ షాతో సంఖ్య మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ ఏ సీట్లు అనేది చంద్రబాబు వారిముందు జాబితా ఉంచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో మాత్రం టీడీపీ బలహీనంగా ఉన్న సీట్లనే బీజేపీకి కేటాయించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు.
కోరిన సీట్లను...
పార్లమెంటు సీట్లు వరకూ వచ్చేసరికి బీజేపీ కోరిన సీట్లు ఇవ్వక తప్పదు. చంద్రబాబుకు ఇప్పడు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ముఖ్యం. తిరిగి ముఖ్యమంత్రి కావడం అత్యవసరం. ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ శాసనసభలోకి అడుగుపెడతానన్న శపథాన్ని ఆయన నెరవేర్చుకోగలుగుతారు. అందుకే పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ డిమాండ్ కు కొంత అటు ఇటుగా చంద్రబాబు అంగీకరించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. బీజేపీ ఆరు నుంచి ఏడు పార్లమెంటు స్థానాలు కోరే అవకాశముంది. అయితే ఐదింటి వరకూ బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అధినేత మానసికంగా ఫిక్స్ అయిపోయారంటున్నారు. మరో వైపు టీడీపీలో ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. జనసేనతో పొత్తు ఉండటంతో తాము గెలవడం గ్యారంటీ అని సీటు తమదేనన్న నమ్మకంతో కొంతకాలంగా పార్టీకి పనిచేస్తున్నరు. వారిని చంద్రబాబు పక్కన పెట్టలేని పరిస్థితి.
అడుగుతున్నప్పటికీ...
విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి స్థానాలను బీజేపీ కోరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఐదు నుంచి ఆరు వరకూ చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పొత్తులో ఉన్న మరో పార్టీ జనసేనకు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారంటున్నారు. మొత్తం ఎనిమిది స్థానాలు పొత్తుల్లో భాగంగా భాగస్వామ్యపార్టీలకు వెళ్లినా మిగిలిన స్థానాల్లో మనోళ్లను దింపి గెలిపించుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్లు వచ్చే సరికి బీజేపీకి ఐదారుకు మించి ఇవ్వరని కూడా చెబుతున్నారు. అంతకు మించి బీజేపీ కూడా కోరే అవకాశాలు లేవంటున్నారు.
పార్లమెంటు స్థానాలపైనే...
బీజేపీ కూడా పార్లమెంటు స్థానాలపైనే కొంత పట్టుబట్టే అవకాశముంది. అంతే తప్ప అసెంబ్లీ సీట్ల విషయంలో చూసీ చూడనట్లు పోతుందని తెలుసు. అందుకే చంద్రబాబు శాసనసభ స్థానాలు గతంలో బీజేపీ గెలిచిన సీట్లను ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం, తాడేపల్లి గూడెం, కైకలూరు, నరసరావుపేట, తిరుపతి అసెంబ్లీ స్థానాలను బీజేపీ అడిగినా అడిగినవన్నీ ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా చంద్రబాబు మాత్రం లేరు. ఆయన ఈసారి టీడీపీ బలహీనంగా ఉన్న స్థానాలను మాత్రమే బీజేపీకి కేటాయించే అవకాశాలే ఉన్నాయి. టీడీపీ నేతలను కూడా నిరాశ పర్చకుండా చంద్రబాబు బీజేపీని ఎలా సంతృప్తిపరుస్తారన్నదే అసలైన సమస్య. అయితే ఎన్ని స్థానాలు? ఎక్కడ? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Next Story