Mon Dec 23 2024 03:21:29 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : కేశినేని నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు... నో టిక్కెట్ అంటూ
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు
Kesineni Nani :విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయడం లేదు. కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ఇన్ఛార్జిగా నియమించినట్లు చంద్రబాబు తెలిపినట్లు కేశినేని నాని ట్విట్టర్ లో తెలిపారు. అయితే అధినేత ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానని, చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరిస్తూ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు.
రెండుసార్లు గెలిచినా...
కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు ఎన్నికల నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా టీడీపీ ఓటమి పాలయినా విజయవాడలో కేశినేని నాని గెలుపొందారు. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నుంచి కేశినేని నానికి, అధినాయకత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. కేశినేని నాని పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా ప్రశంసించారని ఆయన వ్యతిరేకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
ఇద్దరి మధ్య...
అయితే గత కొంత కాలం నుంచి కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని గత కొంతకాలంగా యాక్టివ్ గా పార్టీలో తిరుగుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేశినేని నానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులందరూ కేశినేని చిన్ని నాయకత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 7వ తేదీన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
లోకేష్ కు సన్నిహితంగా...
రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. తలలు పగిలాయి. ఇరువర్గాలకు చెందిన 30 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కేశినేని నాని స్థానంలో కేశినేని చిన్ని ని ఇన్ఛార్జిగా నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో విజయవాడ పార్లమెంటు సీటుపై ఇక క్లారిటీ వచ్చినట్లయింది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేయడం ఖాయమయిపోయింది. కేశినేని చిన్నికి నారా లోకేష్ మద్దతు కూడా ఉండటంతో ఆయనకు మరింత సులువయింది. మరి కేశినేని నాని ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story