Wed Dec 18 2024 23:04:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పవన్ ఇంటికి నేరుగా చంద్రబాబు అందుకేనటగా?
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముందుగా జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముండటంతో అన్ని రాజకీయ పార్టీలూ స్పీడ్ ను పెంచాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇక ప్రచారంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ వేగం పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. సుదీర్ఘంగా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
సీట్ల సర్దుబాటు...
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో రెండు పార్టీలూ శ్రమిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై స్పష్టత వస్తే గాని ఎవరి వ్యూహాలతో వారు జనం ముందుకు వెళ్లలేరు. అందుకే చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ తో చర్చించినట్లు తెలిసింది. వచ్చే నెల రెండో వారం అంటే సంక్రాంతి పండగ నాటికి సీట్ల పంపకంపై స్పష్టత వచ్చేలా చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. గతంలో పలుమార్లు పవన్ చంద్రబాబు ఇంటికి వెళ్లగా ఈసారి చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.
ప్రచార వ్యూహంపై...
దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి? ప్రచార వ్యూహాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. కనీసం ఇద్దరం కలసి మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార సభలను నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు పార్టీలకు చెందిన ఓట్లు బదిలీ అయ్యే విషయంపై ఇరువురు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయాలన్న దానిపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది.
Next Story