Mon Dec 23 2024 10:29:57 GMT+0000 (Coordinated Universal Time)
TDP : గంటాను చీపురుపల్లికి షిఫ్ట్ చేస్తారాట.. కానీ ఆయన మాత్రం?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో సీటు లేదని చెప్పేసింది
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో సీటు లేదని చెప్పేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు సూచించింది. అయితే గంటా మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి లేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలీ కూడా జనసేనకు కేటాయించాల్సి రావడంతో గంటా శ్రీనివాసరావుకు విశాఖ జిల్లాలో నియోజకవర్గం కేటాయించడానికి లేకుండా పోయింది. దీంతో ఆయనను అక్కడి నుంచి తప్పించి విజయనగరం జిల్లాకు పంపేందుకు అధినాయకత్వం సిద్ధమయింది.
చీపురుపల్లి నుంచి....
ఈ మేరకు గంటా శ్రీనివాసరావు పార్టీ అధినాయకత్వం సూచనప్రాయంగా తెలిసింది. చీపురుపల్లిలో ప్రస్తుత మంత్రి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గంలో సమర్థుడైన నాయకుడు లేకపోవడంతో గంటా శ్రీనివాసరావును పంపాలని చంద్రబాబు భావించారు. విశాఖ రాజకీయాల నుంచి గంటాను తప్పించే ప్లాన్ లో భాగంగానే ఆయనను విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు గంటా వర్గీయులు అనుమానిస్తున్నారు. విశాఖలో ఉంటే ఇక్కడ గ్రూపులు గోల ఎక్కువగా ఉంటుందని, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు మధ్య అసలు పొసగదు కనుక గంటాను విజయనగరం జిల్లాకు పంపాలని నిర్ణయించింది.
150 కి.మీల దూరంలో....
అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తాను విశాఖ జిల్లా నుంచే రాజకీయాలు చేస్తానని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయబోనని తెలిపారు. విశాఖకు చీపురుపల్లి 150 కిలోమీటర్ల దూరంగా ఉ:టుందని, అన్నీ ఆలోచించుకుని హైకమాండ్ కు తన నిర్ణయాన్ని త్వరలోనే చెబుతానని ఆయన మీడియాకు వివరించారు. విశాఖ జిల్లా నుంచే తాను రాజకీయాలను ప్రారంభించానని, తొలుత అనకాపల్లి పార్లెమెంటుకు తర్వాత చోడవరం, ఆ తర్వాత భీమిలీ, అనంతర విశాఖ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు, విశాఖకు విడదీయలేని అనుబంధం ఉందని కూడా అని అన్నారు.
టిక్కెట్ రాకుంటే...
ఆయన మరో మాట కూడా అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టిక్కెట్లు దక్కని వారు పార్టీ మారడం సహజమేనని అన్నారు. టీడీపీలో టిక్కెట్ రాదని తెలిసి విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లారని, వైసీపీలో కీలకంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి చేరువయ్యారని, ఆదిమూలంకు తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమిస్తే కాదని వెళ్లిపోయారని ఇలా తమకు ఇష్టంలేని చోట ఉండకపోవడం సహజమేనని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తనకు విశాఖ జిల్లాలో టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీ మారతానని పరోక్షంగా పార్టీ హైకమాండ్‌కు హెచ్చరికలు పంపినట్లేనని అంటున్నారు.
Next Story