యువగళం @2000 కి.మీ.. లక్ష్యం వైపు లోకేష్ అడుగులు
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇది అసలు 4000 కిలోమీటర్ల లక్ష్యంలో 50 శాతం మాత్రమే.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇది అసలు 4000 కిలోమీటర్ల లక్ష్యంలో 50 శాతం మాత్రమే. రోజుకు సగటున 10 కి.మీ మేర చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్.. 153రోజుల్లో సగటున 13.15 కి.మీ.ల చొప్పున పాదయాత్ర చేశారు. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకునేలా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే 153 రోజుల్లోనే 50 శాతం లక్ష్యాన్ని అధిగమించారు. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన లోకేష్.. 153వ రోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ.ల మైలురాయిని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం లోకేష్ రాయలసీమలో పాదయాత్రను పూర్తి చేసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. 153 రోజుల్లో 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉందని లోకేశ్ అన్నారు. ఇవాళ సిరిపురం క్యాంపు సైటు నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కొత్తపల్లి బ్రహ్మంగారి ఆలయంలో గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. తన 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్ ప్రభుత్వ బాధితులేనని తెలుసుకున్నానని అన్నారు.
లోకేష్ పాదయాత్ర చేసిన 150 రోజుల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకపోవడం విశేషం. పండుగలకు, తారకరత్న అంతిమ సంస్కారాలకు, ఎన్నికల కోడ్‌కు మాత్రమే విరామం ఇచ్చారు. పాదాలకు పొక్కులు వచ్చినా, తీవ్ర జ్వరం వచ్చినా లోకేష్ నడక కొనసాగించారు. పాదయాత్రలో లోకేష్ నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ప్రజలతో పరస్పర చర్చలు, ఫిర్యాదులు తీసుకోవడం, ప్రతిరోజూ 100 మందికి సెల్ఫీలు ఇవ్వడం, ఆపై పాదయాత్ర కొనసాగించడం వంటి వాటితో రోజు ప్రారంభమవుతుంది. మొదట్లో ప్రభుత్వం పోలీసుల సాయంతో పాదయాత్రను విఫలం చేసేందుకు ప్రయత్నించినా ప్రజల మద్దతు పెరగడంతో ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. పాదయాత్ర తొలిరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమవడం ఖాయమన్నారు. లోకేష్ తన 153 రోజుల యువగళం పాదయాత్రలో లోకేష్ సుమారు 30లక్షలమంది ప్రజలను నేరుగా కలుసుకుని మాట్లాడారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. 49చోట్ల బహిరంగసభలో లోకేష్ ప్రసంగించారు.
118 ముఖాముఖి సమావేశాలు, 6 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్రలో వివిధవర్గాల ప్రజలనుంచి లోకేష్‌కు 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందాయి. పాదయాత్రకు పల్లెప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పాదయాత్రలో లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్‌లు యువతను ఆకట్టుకున్నాయి. టీడీపీ బలంగా ఉన్న అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమలోనూ లోకేష్‌కి అత్యధిక స్పందన వచ్చింది. లోకేష్‌ని పప్పు అని ఎగతాళి చేసేలా ఆయన ప్రసంగాల్లో తడబడతాడా? అని ఎదురుచూశారు. వారికి ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. లోకేష్ తన తండ్రిని ఉపయోగించుకోకపోవడమే ఈ జర్నీలో బెస్ట్ పార్ట్. మొదటి రోజు నుంచి ఒక్కరోజు కూడా చంద్రబాబు పాదయాత్రకు హాజరు కాకపోవడం విశేషం. నిజానికి, లోకేష్ నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడానికి మరియు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయడానికి చంద్రబాబుకు తగినంత సమయం దొరికింది. ఈ కఠోర శ్రమతో 2024లో టీడీపీ గెలిస్తే ముఖ్యమైన బాధ్యతలు వచ్చినప్పుడు లోకేష్ అర్హతను ప్రశ్నించేవారే ఉండరు.