Mon Dec 23 2024 10:06:39 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి మళ్లీ ఆయనేనా..? ఆయనైతేనే గెలుస్తారట
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అవుతుంది. షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అవుతుంది. షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. అన్ని రకాలుగా ఆలోచించి చంద్రబాబు అభ్యర్థిని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇంకా పేరును వెల్లడించకపోయినప్పటికీ అనధికారికంగా ఎంపికయిన రాజ్యసభ అభ్యర్థికి అభినందనలు చెబుతూ టీడీపీ నుంచి ఫోన్లు వస్తున్నాయట. దీంతో చంద్రబాబు నిర్ణయించిన రాజ్యసభ అభ్యర్థి ఆయనేనంటూ పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే రాజ్యసభ స్థానాన్ని కూడా గెలవడం ఖాయమని చంద్రబాబు సయితం నేతలతో చెబుతున్నారట.
ఒక దానిలో...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 8వ తేదీన వెలువడనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైసీపీ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్లను జగన్ ఓకే చెప్పేశారట. చిత్తూరు, పాయకరావుపేటలో కొత్త ఇన్ఛార్జులను నియమించిన సమయంలోనే జగన్ స్వయంగా వారికి రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పారని పార్టీ నేతలే చెబుతుండటంతో ఆ ముగ్గురు పోటీ చేయడం గ్యారంటీ అని అంటున్నారు.
బలాబలాలను చూస్తే...
రాజ్యసభ ఎన్నికలు మూడింటికి జరిగితే ఎమ్మెల్యేల బలాబలాలను పరిశీలిస్తే మూడు వైసీపీకే దక్కాల్సి ఉంటుంది. కానీ ఏదైనా జరగొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల మాదరిగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముంది. 151 మంది సభ్యులున్న వైసీపీకి ఈ మూడు గెలవడం సాధారణ పరిస్థితుల్లో అయితే నల్లేరు మీద నడకే. అయితే అభ్యర్థులను ప్రకటించడం, నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేయడంతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలు ఓట్లు ఎటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. తమకు టిక్కెట్ ఇవ్వని కారణంగా ఆ కోపాన్ని ఇలా తీర్చుకునే అవకాశం కూడా ఉంది. అందుకే చంద్రబాబు ఒక స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
వైసీపీ లో అసంతృప్తులతో...
అయితే వైసీపీ మార్పులు, చేర్పులు చేపట్టిన నియోజకవర్గాలతో పాటు, టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారంటున్నారు చంద్రబాబు. అందుకే ఈసారి కూడా పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను బరిలోకి దించాలని, సామాజికవర్గం పరంగా కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ కార్డు పనిచేసినట్లే.. ఇప్పుడు ఎస్సీ కార్డుతో కొట్టాలని చంద్రబాబు రెడీ అయిపోయారంటున్నారు. గతంలో రాజ్యసభకు కూడా పోటీ చేసి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయననే బరిలోకి దింపి ఎన్నికల సమయంలో ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. త్వరలోనే అధికారికంగా పేరును చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయి.
Next Story